Jagga Reddy: 60 ఏళ్లు పాలించిన వారు ఏమీ చేయకుండానే ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లు చేశారా?: జగ్గారెడ్డి

Jagga Reddy question bjp and brs over projects
  • నాగార్జున సాగర్, బాక్రానంగల్ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని వెల్లడి
  • సింగూరు, మంజీరా నీళ్లు బీజేపీ నేతలు తాగడం లేదా? అని ప్రశ్న
  • పదవి అడిగే స్వేచ్ఛ కేవలం కాంగ్రెస్‌లో మాత్రమే ఉందని వ్యాఖ్య

దేశంలో... తెలంగాణలో 60 ఏళ్లు పాలించి వారు ఏమీ చేయకుండానే ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లే చేశారా? అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ పార్టీ పెంచితే... వాటిని ప్రయివేటువారికి బీజేపీ ధారాదత్తం చేసిందని విమర్శించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు.

నాగార్జునసాగర్, బాక్రానంగల్ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్సే అన్నారు. హైదరాబాద్‌కు సాగునీటిని అందించేందుకు జంట జలాశయాలు నిర్మించింది తమ పార్టీయే అన్నారు. సింగూరు, మంజీరా నీళ్లు బీజేపీ నేతలు తాగడం లేదా? అని నిలదీశారు. హైదరాబాద్‌కు వస్తోన్న తాగునీళ్లు కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల నుంచే వస్తున్నాయన్నారు. 17 ఏళ్ల నెహ్రూ కాలంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించామన్నారు.

ఒక్క డ్యాం కూడా కట్టని ప్రధాని... ప్రాజెక్టుల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. బీజేపీ ఈ పదేళ్లలో ఎన్ని పరిశ్రమలు తెచ్చింది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? అని నిలదీశారు. బీజేపీ హయాంలో పెట్రోల్, డీజిల్, బంగారం.. ఇలా అన్ని ధరలూ పెరిగాయని విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీలోనే పదవి అడిగే స్వేచ్ఛ

పీసీసీ అధ్యక్ష పదవిని అడిగే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుందన్నారు. బీజేపీలో ఢిల్లీకి వెళ్లి అడిగే స్వేచ్ఛ ఉండదని... ఇక బీఆర్ఎస్‌లో అయితే మరొకరికి అవకాశమే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అయితే ఎవరైనా అడగవచ్చునని చెప్పారు.

  • Loading...

More Telugu News