T20 World Cup 2024: న్యూయార్క్‌ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. ఇదిగో వీడియో!

India Cricket Team Reach New York Ahead of ICC T20 World Cup 2024
  • న్యూయార్క్‌ చేరుకున్న కోచ్‌ ద్రవిడ్‌, రోహిత్‌ శర్మ, పంత్‌, దూబే
  • జూన్ 1న బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మ‌ప్ మ్యాచ్‌
  • జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడ‌నున్న భార‌త్‌ 

ఐసీసీ మెగా టోర్నీ టీ 20 వరల్డ్‌ కప్‌ 2024 మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. అమెరికా, విండీస్ సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఈసారి ఏకంగా 20 జ‌ట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు టీ20 సమరానికి సిద్ధమయ్యాయి. ఆయా జ‌ట్లు తాము మ్యాచులు ఆడే వేదిక‌ల‌కు చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టు కూడా అమెరికా ప‌య‌న‌మైంది. తాజాగా టీమిండియా ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ కోసం న్యూయార్క్ చేరుకుంది. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ ముగియడంతో ఫైనల్‌ ఆడే భారత క్రికెటర్లు తప్ప మిగిలినవాళ్లంతా శనివారమే (మే 25న‌) యూఎస్‌ ఫ్లైట్ ఎక్కారు. తాజాగా వీరు న్యూయార్క్‌లో దిగారు. 

హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, శివం దూబే, కుల్దీప్‌ యాదవ్‌, మ‌హ్మ‌ద్‌ సిరాజ్ న్యూయార్క్‌ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘టచ్‌డౌన్‌ న్యూయార్క్‌’ అంటూ బీసీసీఐ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా షేర్‌ చేసింది. జూన్ 1వ తేదీన బంగ్లాదేశ్‌తో జ‌రిగే వార్మ‌ప్ మ్యాచ్‌తో టీమిండియా టోర్నీని ప్రారంభించ‌నుంది. 

2013 నుంచి ఒక్క ఐసీసీ ట్రోఫీ గెల‌వ‌ని భార‌త్‌
ఇక భార‌త్‌ 2013లో జ‌రిగిన ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ త‌ర్వాత ఒక్క ఐసీసీ టైటిల్‌ కూడా గెల‌వ‌క‌పోవ‌డం గ‌మనార్హం. అప్ప‌టి నుంచి భార‌త జ‌ట్టు వివిధ ఐసీసీ టోర్నీల‌లో ఫైన‌ల్‌, సెమీ ఫైన‌ల్స్ లో బోల్తా ప‌డుతోంది. గ‌తేడాది స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ టీమిండియా ఫైన‌ల్‌లో ఓడి త్రుటిలో ఐసీసీ ట్రోఫీ చేజార్చుకుంది. 

అంత‌కుముందు 2015, 2019లో సెమీస్ నుంచి ఇంటిముఖం ప‌ట్టింది. ఇక 2021, 2023లో ఐసీసీ వ‌ర‌ల్డ్‌ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ టైటిల్స్ మిస్ చేసుకుంది. అలాగే 2014లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌లో ఓడిపోయింది. ఆ త‌ర్వాత 2016, 2022లో సెమీ ఫైన‌ల్స్ వ‌ర‌కు వెళ్లి కంగుతింది. ఇలా 2013 నుంచి భార‌త్‌ను ఐసీసీ ట్రోఫీ ఊరిస్తోంది. ఈసారైనా టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలుస్తుందేమో చూడాలి.  

టీ20 వరల్డ్‌ కప్‌కు భార‌త జట్టు ఇదే..
ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌ కప్‌ కోసం బీసీసీఐ 15 మంది స‌భ్యుల‌తో కూడిన జట్టును ఇప్ప‌టికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌ కాగా, హార్దిక్‌ పాండ్యను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. అంద‌రూ ఊహించి‌న‌ట్టుగానే వికెట్ కీప‌ర్లుగా రిష‌భ్ పంత్, సంజూ శాంస‌న్‌లను ప్రపంచ‌క‌ప్ స్క్వాడ్‌కు ఎంపిక చేయ‌డం జ‌రిగింది. శుభ్‌మ‌న్ గిల్, రింకూ సింగ్, ఖ‌లీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ రిజర్వ్ ప్లేయ‌ర్లుగా ఎంపిక‌య్యారు.

భార‌త జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.

టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్‌
భార‌త్ వ‌ర్సెస్‌ ఐర్లాండ్‌ - జూన్‌ 5 (న్యూయార్క్)
భార‌త్ వ‌ర్సెస్‌ పాకిస్థాన్‌ - జూన్‌ 9 ( న్యూయార్క్)
భార‌త్ వ‌ర్సెస్‌ యూఎస్‌ఏ - జూన్‌ 12 (న్యూయార్క్)
భార‌త్ వ‌ర్సెస్‌ కెనడా - జూన్‌ 15 (ఫ్లోరిడా)

  • Loading...

More Telugu News