Cyclone: రెమాల్ తుపానుకు అర్థం తెలుసా? అసలు తుపాన్లకు పేర్లు ఎలా పెడతారు?

Cyclone Remal makes landfall Know what the name means and how it is given
  • సైక్లోన్ లకు పేర్ల వెనక సుదీర్ఘ చరిత్ర
  • ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ పీటీసీలోని సభ్య దేశాల సిఫార్సులతోనే తుపాన్లకు పేర్లు
  • బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుపాన్లకు 2004 నుంచి కొనసాగుతున్న నామకరణ పద్ధతి

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను సోమవారం తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐల్యాండ్, బంగ్లాదేశ్ లోని ఖెపుపారా మధ్య తీరాన్ని తాకింది. పెను గాలులు, భారీ వర్షాలతో ఆయా ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. కానీ రెమాల్ అంటే అర్థం ఏమిటి? దీనికి ఒమన్ దేశం ఆ పేరు ఎందుకు పెట్టింది? బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే అరేబియా సముద్రం పరిధిలో ఉండే దేశం దీనికి పేరు ఎలా పెట్టగలిగింది? అసలు తుపాన్లకు పేర్లు ఎందుకు పెడతారు?

దశాబ్దాల కిందట ఏర్పాటు..

ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ)లో 185 సభ్య దేశాలు ఉన్నాయి. ఆసియా ఖండంలో ఆర్థిక కార్యకలాపాలు వృద్ధి చెందేందుకు వీలుగా ఆసియా, పసిఫిక్ ప్రాంత ఆర్థిక, సామాజిక కమిషన్ తో కలసి డబ్ల్యూఎంఓ జట్టుకట్టింది. ఇందులో భాగంగా ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుపాన్ల హెచ్చరికలు, విపత్తు సన్నద్ధతను పెంచేందుకు ఉష్ణమండల తుపాన్లపై సభ్య మండలి (పీటీసీ)ని 1972లో ఏర్పాటు చేసింది. ఈ మండలిలో తొలుత భారత్ తోపాటు బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, పాకిస్థాన్, శ్రీలంక, ఒమన్, థాయ్ ల్యాండ్ సభ్య దేశాలుగా ఉండేవి. 2000 సంవత్సంలో ఒమన్ లోని మస్కట్ లో జరిగిన సమావేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుపాన్లకు పేర్లు పెట్టాలని పీటీసీ నిర్ణయించింది. ఒక్కో సభ్య దేశం పంపిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని ఒక జాబితాను ఖరారు చేసింది. దాని ప్రకారం 2004 నుంచి తుపాన్లకు పేర్లు పెడుతోంది.

2018లో జరిగిన సమావేశంలో సభ్య దేశాలను పీటీసీ విస్తరించింది. ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ లకు సభ్యత్వం ఇచ్చింది. 2020 ఏప్రిల్ లో ఒక్కో దేశం నుంచి 13 పేర్ల చొప్పున మొత్తం 169 తుపాన్ల పేర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారమే ఈ ప్రాంతంలో ఏర్పడే తుపాన్లకు పేర్లు పెడుతున్నారు.

సభ్య దేశాల పేర్ల ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో తుపాన్ల పేర్ల జాబితాను రూపొందించారు. ఏ దేశం సిఫార్సు చేసిందన్న దానితో నిమిత్తం లేకుండా రొటేషన్ పద్ధతిలో తుపాన్లకు పేర్లు పెడుతున్నారు. ఈ లెక్కన తాజాగా ఒమన్ దేశం గతంలో సిఫార్సు చేసిన రెమాల్ పేరును బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపానుకు పెట్టారు. అరబిక్ భాషలో రెమాల్ అంటే ఇసుక అని అర్థం.

తుపాన్ల పేర్ల వెనక లెక్కలెన్నో..
సభ్య దేశాలు తుపాన్ల పేర్లను సిఫార్సు చేసేందుకు పీటీసీ కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. వాటికి అనుగుణంగా ఉన్న పేర్లనే పరిగణనలోకి తీసుకుంది. ఆ మార్గదర్శకాలు ఏమిటంటే..
– దేశ రాజకీయ పరిస్థితులు, రాజకీయ ప్రముఖల పేర్లు తుపాన్లకు పెట్టరాదు. ఈ పేర్లు మతవిశ్వాసాలు, సంస్కృతితో సంబంధంలేనివి అయ్యుండాలి. పేర్లలో లింగ భేదం ఉండకూడదు.
– ప్రపంచంలోని ఏ జాతిని కించపరిచేలా ఉండరాదు.
– గరిష్ఠంగా 8 అక్షరాలు మాత్రమే ఉండాలి.
– పేరు ప్రత్యేకంగా ఉండాలి. గతంలో ఎవరూ ఆ పేరు వాడి ఉండకూడదు.
– ఆ పదం పేరు, ఉచ్చారణ వాయిస్ రికార్డింగ్ ఉండాలి.

పేర్లు ఎందుకు పెట్టాలంటే..

తుపాన్ల గురించి సామాన్య ప్రజలకు సులువుగా, స్పష్టంగా తెలియజెప్పేందుకే తుపాన్లకు పేర్లు పెడుతున్నారు. తుపాన్లకు సాంకేతిక పదాలు లేదా నంబర్లు పెట్టే బదులు మామూలు పేర్లు పెడితే సామాన్యులతోపాటు శాస్ర్తవేత్తలు, విపత్తు నిర్వహణ సంస్థలు, మీడియాకు తేలికగా గుర్తుంటుంది. ఒకే ప్రాంతంలో వేర్వేరు తుపాన్లు ఏర్పడ్డప్పుడు ప్రజల్లో గందరగోళాన్ని నివారించేందుకు వీలవుతుంది. తుపాన్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దోహదపడుతుంది. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసేందుకు, ప్రజల్ని సంసిద్ధులను చేసేందుకు ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఇదే తరహాలో తుపాన్లకు పేర్లు పెడుతున్నారు.

  • Loading...

More Telugu News