Hyderabad: హైదరాబాద్ ఐటీ ఫీల్డ్‌ వీధుల్లో అర్ధరాత్రి పోకిరీల ఆగడాలు

Bikers Hold races in IT Hub rayadurgam in Hyderabad midnight
  • టీహబ్ రోడ్లలో వారాంతాల్లో అర్ధరాత్రి బైకర్ల రేసులు 
  • రోడ్లు విశాలంగా ఉండటంతో ఐటీ క్షేత్రాన్ని ఎంచుకుంటున్న పోకిరీలు
  • పోలీసుల నిఘా కొరవడటంతో పోకిరీలు రెచ్చిపోతున్న వైనం
  • గస్తీ మరింత కట్టుదిట్టం చేస్తామన్న రాయదుర్గం ఇన్‌స్పెక్టర్

హైదరాబాదులోని రాయదుర్గం టీహబ్ రోడ్లు, ఐటీ క్షేత్రంలో రహదారులు పోకిరీల ఆగడాలకు కేంద్రంగా మారుతున్నాయి. అర్ధరాత్రి వేళ పోకిరీలు బైకు రేసులు, విన్యాసాలతో హల్‌చల్ చేస్తున్నారు. నగరం నలుమూలల నుంచి భారీగా బైకర్లు గుంపులుగా చేరుకుని వాహనాలను మెరుపు వేగంతో నడుపుతూ విన్యాసాలకు దిగుతున్నారు. పోలీసుల నిఘా అంతంత మాత్రంగా ఉండటంతో పోకిరీల ఆగడాలు మితిమీరుతున్నాయి. 

రాయదుర్గం ఐటీ క్షేత్రంలో.. ముఖ్యంగా టీహబ్ రోడ్లల్లో ఈ రేసులు జరుగుతున్నాయి. అర్ధరాత్రి జనసంచారం పూర్తిగా తగ్గిపోగానే బైకర్ల పందేలు మొదలుపెడుతున్నారు. వేగంగా నడిపే క్రమంలో అదుపు తప్పితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

టీహబ్ ఎదుట ఉన్న అరకిలోమీటరు రోడ్డుపై రేసులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అరబిందో గేలక్సీ ముందున్న రోడ్డును, రెండు గుట్టల మధ్య నుంచి మైహోం భుజా వరకూ రేసులు జరుగుతున్నాయి. ఈ రోడ్లు విశాలంగా ఉంటడంతో వారాంతాల్లో బైకు రేసులు నిర్వహిస్తున్నారు. పోలీసుల నిఘా కొరవడటంతో పోకిరీల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. 

అయితే, రేసుల కట్టడికి గస్తీని మరింత కట్టుదిట్టం చేస్తామని రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపారు. బైకర్లను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనాలను సీజ్ చేసి ఆర్టీఏకు అప్పగిస్తామన్నారు. మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులపై కేసు ఉంటుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News