Victoria Waterfalls: 380 అడుగుల ఎత్తయిన జలపాతం అంచున పడుకొని..!

Woman Teeters on Edge of Victoria Falls Viral video Will Leave You in Awe
  • వీడియో తీయించుకున్న ఓ మహిళా టూరిస్ట్ 
  • నెట్టింట వైరల్ అవుతున్న పాత వీడియో
  • ఇదేం పిచ్చి అంటూ మండిపడుతున్న నెటిజన్లు

ఫొటోలు, వీడియోల కోసం కొందరు వేలం వెర్రిగా ప్రవర్తిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమని తెలిసినా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. 380 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతున్న భారీ జలపాతం అంచున పడుకొని ఓ మహిళా టూరిస్ట్ జలకాలాడిన పాత వీడియో ఒకటి నెట్టింట మళ్లీ చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో ఓ యువతి జాంబియా–జింబాబ్వే దేశాల మధ్య ప్రవహించే ప్రఖ్యాత విక్టోరియా ఫాల్స్ అంచున పడుకొని కిందకు చూడటం కనిపించింది. ప్రపంచంలోని అతిపెద్ద జలపాతాల్లో విక్టోరియా ఫాల్స్ ఒకటి.

ఆ సమయంలో జలపాతంలోని నీరు ఉద్ధృతంగా కిందకు ప్రవహిస్తోంది. ఎందరో టూరిస్టుల ప్రాణాలు బలిగొన్న ఈ జలపాతాన్ని స్థానికులు డెవిల్స్ పూల్ గా అభివర్ణిస్తుంటారు. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే పేరుతో ఉన్న ‘ఎక్స్’ హ్యాండిల్ ఈ వీడియోను నెటిజన్లతో పంచుకుంది. ‘380 అడుగుల జలపాతానికి ఇంత దగ్గరగా నిలవడం అనేది మామూలు విషయమే అని తెలుసుకున్నా’ అంటూ ఆ వీడియో కింద కామెంట్ పోస్ట్ చేసింది. ఈ వీడియోను తాజాగా పోస్ట్ చేసిన రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా సుమారు 3 కోట్ల వ్యూస్ లభించాయి.

ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా ఆ మహిళా పర్యాటకురాలిపై మండిపడుతున్నారు. ఇదేం పిచ్చి పని అంటూ విమర్శిస్తున్నారు. ‘వామ్మో.. వీడియోను చూస్తుంటేనే నాకు భయం వేస్తోంది’ అని ఓ యూజర్ స్పందించగా మరొకరేమో ‘నేను ఎప్పటికీ అలా చేయను’ అంటూ పేర్కొన్నాడు. ఇంకొకరు స్పందిస్తూ ‘హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఫొటోల కోసం ఇలా జలపాతం అంచున నిలబడి ప్రవాహంలో కొట్టుకుపోయి ఎందరో మరణిస్తున్నట్లు తరచూ వింటుంటాను. పాకుడు రాళ్లపై జారిపోతూ పట్టు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రాణభయంతో వారు చూసే చూపును చూడాలని లేదా గుర్తుంచుకోవాలని అనుకోవట్లేదు’ అని కామెంట్ పెట్టారు. అయితే మరో యూజర్ మాత్రం ఆమె కాళ్లకు తాడు కట్టుకొని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. అందుకే ఆమె ధైర్యంగా కనిపిస్తోందని.. వీడియోలోనూ ఆమె కాళ్లను చూపించలేదని పేర్కొన్నాడు.

వాస్తవానికి ఈ వీడియో సుమారు రెండేళ్ల కిందటిది. ఏడాది కిందట ఓసారి వైరల్ అయింది. తాజాగా మరోసారి నెట్టింట వ్యాప్తి చెందుతోంది. ఆఫ్రికా ఖండంపై అడుగుపెట్టిన తొలి వ్యక్తిగా భావించే డేవిడ్ లివింగ్ స్టోన్ అనే యూరోపియన్ ఈ జలపాతానికి బ్రిటన్ రాణి విక్టోరియా పేరు పెట్టారు.


  • Loading...

More Telugu News