Shah Rukh Khan: కోల్‌కతా ఐపీఎల్ గెలవడంతో షారుఖ్ ఎమోషనల్.. వీడియో ఇదిగో

Shah Rukh Khan Kisses Gauri Khan As KKR win IPL 2024 Trophy
  • భార్య గౌరీ ఖాన్‌ను హత్తుకొని ముద్దు పెట్టిన బాలీవుడ్ బాద్ షా
  • 10 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలవడంతో భావోద్వేగానికి గురైన కోల్‌కతా సహ యజమాని
  • ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు

దాదాపు 2 నెలలపాటు క్రికెట్ ప్రియులను అమితంగా అలరించిన ఐపీఎల్-2024 సీజన్ ముగిసింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తీవ్ర నిరాశ ఎదురవ్వగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కోల్‌కతా నిలిచింది. దీంతో ఆ జట్టు సహ-యజమాని షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యాడు. మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ని వీక్షించిన షారుఖ్... కో‌ల్‌కతా జట్టు ఫైనల్ మ్యాచ్ గెలిచిన వెంటనే పట్టరాని సంతోషంతో పక్కనే ఉన్న తన భార్య గౌరీ ఖాన్‌ను హత్తుకుని, ఆమెకు ముద్దు పెట్టాడు. ఆ సంతోషంలో సహ యజమానులతో కరచాలనం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

కోల్‌కతా జట్టు చివరిసారిగా 2014లో ట్రోఫీ గెలిచింది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇప్పుడు టైటిల్‌ని గెలిచింది. అందుకే షారుఖ్ ఇంతలా ఎమోషనల్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చి అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. కుటుంబ సభ్యులతో కలిసి మైదానం నలువైపులా తిరిగి మ్యాచ్‌కు విచ్చేసిన క్రికెట్ ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు.

కాగా ఇటీవలే వడదెబ్బకు గురైన షారుఖ్ ఖాన్ హాస్పిటల్‌లో చికిత్స అనంతరం కోలుకున్నాడు. దీంతో భార్య గౌరీ ఖాన్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఫైనల్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించాడు. కాగా చెన్నై వేదికగా కోల్‌కతా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా కొనసాగిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్‌కతా ఈ టార్గెట్‌ను కేవలం 10.3 ఓవర్లలోనే ముగించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.

  • Loading...

More Telugu News