Perni Nani: ఒక కంటికి కాటుక పూసి, మరో కంట్లో కారం పెడుతున్నారంటూ పోలీసులపై మండిపడ్డ పేర్ని నాని

Perni Nani Press meet
  • పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో దారుణాలు
  • అధికార యంత్రాంగం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని ఆరోపణ
  • వైసీపీని బలోపేతం చేసిన నాయకులను వేధిస్తున్నారని ఫైర్

ఆంధ్రప్రదేశ్ లో అధికార యంత్రాంగం తీరు దారుణంగా ఉందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ వైసీపీ నాయకులను వేధిస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో పోలీసుల తీరు తీవ్ర ఆక్షేపణీయమని అన్నారు. ఆయా జిల్లాల్లో టీడీపీని నామరూపాల్లేకుండా చేసి వైసీపీని బలోపేతం చేసిన నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఒక కంటికి కాటుక పెట్టి, మరో కంట్లో కారం కొట్టినట్లు పోలీసులు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. పోలింగ్ రోజు హింస జరుగుతుందని ముందే తెలిసినా స్పందించని పోలీసులు.. తీరా హింస జరిగాక వైసీపీ నాయకులపై కేసులు పెట్టారని ఆరోపించారు.

టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ కేవలం వైసీపీ కార్యకర్తలను మాత్రమే వేటాడుతున్నారని చెప్పారు. నరసరావుపేటలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. ఆయన ఎంత సౌమ్యుడో పార్టీ కార్యకర్తలకే కాదు ప్రజలకు కూడా తెలుసని వివరించారు. అలాంటి వ్యక్తి మీద హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు.. ఆ నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు నివాసంలో బాంబులు దొరికినా కూడా కేసు పెట్టలేదంటూ పోలీసులపై పేర్ని నాని మండిపడ్డారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దొరకకపోవడంతో ఆయన మామగారిపై హత్యాయత్నం జరిగినా పోలీసులు స్పందించలేదన్నారు. అధికార యంత్రాంగం ముద్దాయిలను వదిలివేస్తూ ముద్దాయిలు కాని వారిని వెంటాడి వేటాడుతోందని పేర్ని నాని విమర్శించారు.

  • Loading...

More Telugu News