IPL 2024 final: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌.. ప్యాట్ కమ్మిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

SRH skipper Pat Cummins tried to down expectations ahead of IPL 2024 final match
  • తన టైటిల్స్ గెలుపునకు ఎక్కడో ఒక చోట ముగింపు పడుతుందన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్
  • ఫైనల్‌పై ఖచ్చితమైన అంచనా ఏదీ లేదని వ్యాఖ్య
  • ఫైనల్ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ప్యాట్ కమ్మిన్స్

ఐపీఎల్-2024 విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది!. ఈ రోజు (ఆదివారం) రాత్రి 7.30 గంటలకు చెన్నై వేదికగా జరగనున్న గ్రాండ్ ఫైనల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడబోతున్నాయి. సమవుజ్జీల మధ్య జరగనున్న ఈ ఫైనల్ సమరం ఉత్కంఠభరితంగా కొనసాగడం ఖాయమని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆస్ట్రేలియా కెప్టెన్‌గా 2023 వన్డే వరల్డ్ కప్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలిపించారని, మరి సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ ఫైనల్‌పై అంచనాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించగా కమ్మిన్స్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

తన టైటిల్స్ గెలుపు బాటలో ఏదో ఒకచోట ముగింపు పడుతుందని, అయితే తాను మరొక ట్రోఫీని స్వాగతిస్తానని కమ్మిన్స్ వ్యాఖ్యానించాడు. ఈ విధంగా టైటిల్స్ గెలవడం చాలా అద్భుతంగా ఉందని, అయితే ఏదో ఒక చోట ఆగిపోవడం తప్పదు కదా అని అన్నాడు. గత రెండేళ్ల కాలం తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరాలు అని, అయితే ఐపీఎల్‌కు తాను ఏ టీ20 సిరీస్‌కూ కెప్టెన్‌గా వ్యవహరించలేదని కమ్మిన్స్ ప్రస్తావించాడు. కాబట్టి ఫైనల్ మ్యాచ్‌పై ఖచ్చితమైన అంచనా ఏమీలేదని పేర్కొన్నాడు. ఈ మేరకు శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడాడు. తద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై అంచనాలను తగ్గించేందుకు ప్యాట్ కమ్మిన్స్ ప్రయత్నించాడు.

సన్‌రైజర్స్ యంగ్ స్టార్స్ నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మలపై ప్యాట్ కమ్మిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. వీళ్లిద్దరూ మ్యాచ్‌లను గెలిపిస్తున్నారని అభినందించాడు. జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్‌ వంటి అనుభవజ్ఞులతో తమ బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉందని పేర్కొన్నాడు. ఇతర కుర్రవాళ్లు కూడా అద్భుతమని మెచ్చుకున్నాడు. ఆటగాళ్లందరూ చక్కగా ఆడుతున్నారు కాబట్టే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరిందని పేర్కొన్నాడు.

కాగా ప్యాట్ కమ్మిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా 20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్‌రమ్ స్థానంలో కెప్టెన్‌గా నియమించింది. తన అంచనాలకు తగ్గకుండా ప్యాట్ కమ్మిన్స్ రాణిస్తున్నాడు. ఐపీఎల్-2024 కమ్మిన్స్ ఇప్పటివరకు 17 వికెట్లు తీశాడు. 147.36 స్ట్రైక్ రేట్‌తో 112 పరుగులు కూడా రాబట్టాడు.

  • Loading...

More Telugu News