Revanth Reddy: మన గీతానికి పక్క రాష్ట్రం వారు పని చేయడమేమిటి?: కీరవాణి కంపోజ్ చేయడంపై రేవంత్ రెడ్డికి TCMA లేఖ

TCMA letter to CM Revanth Reddy on Jaya Jayahe Telangana composing
  • జయ జయహే తెలంగాణను కీరవాణితో కంపోజ్ చేయించిన తెలంగాణ ప్రభుత్వం
  • పక్క రాష్ట్రం వారితో కంపోజింగ్ చేయించడం చారిత్రక తప్పిదమని TCMA లేఖ
  • తెలంగాణలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు... వారికి అవకాశమిచ్చి గౌరవంచాలని విజ్ఞప్తి

మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రం వారు పాడటమేమిటని తెలంగాణ సినీ మ్యూజిషీయన్స్ అసోసియేషన్-TCMA... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం లేఖ రాసింది. జయ జయహే తెలంగాణ... గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించినందుకు గర్విస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ గీతం విషయంలో గత ప్రభుత్వం తప్పులు చేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే ఇది ఎంతో ప్రాచుర్యం పొందిందని గుర్తు చేశారు.

అయితే ఈ గీతానికి సంగీతం అందించమని... ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని కోరటం చారిత్రక తప్పిదమవుతుందని పేర్కొంది. తెలంగాణ అస్తిత్వం మీకు (సీఎం రేవంత్ రెడ్డి) తెలియంది కాదు... ఉద్యమం ఎందుకు పుట్టిందో కూడా తెలియంది కాదు... మన ఉద్యోగాలు మనకే... మన అవకాశాలు మనకే అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని గుర్తు చేసింది.

సకల జనుల సహకారంతో... అమరవీరుల త్యాగంతో రాష్ట్రం ఏర్పడిందని... ఈ నేపథ్యంలో ఈ గీతాన్ని పక్క రాష్ట్రాలవాళ్లు పాడటం ఏమిటని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేస్తే తెలంగాణ కళాకారులను అవమానించడమే అవుతుందన్నారు. తెలంగాణలోనూ ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారని... కాబట్టి మన తెలంగాణ వారికి అవకాశమిచ్చి మనవారికి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నామని తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతంపై కసరత్తు చేస్తోంది. జూన్ 2న సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ గీతాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషాల నిడివిలో ఈ గీతం సిద్ధమవుతోంది. ఈ గేయాన్ని కీరవాణితో తెలంగాణ ప్రభుత్వం కంపోజ్ చేయించింది. ఈ అంశంపై తెలంగాణ సినీ మ్యూజిషీయన్స్ అసోసియేషన్... సీఎంకు లేఖ రాసింది.

  • Loading...

More Telugu News