Trinamool Congress: 'ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్ లు..' అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలు.. స్పందించిన ఈసీ

trinamool congress alleges evms tampered with bjp tags
  • బెంగాల్ లో ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసిందని ఆరోపణ
  • ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు పెట్టే ముందు సంతకాలు తీసుకున్నట్లు ఈసీ వెల్లడి
  • ఓ కేంద్రంలో కేవలం బీజేపీ తరఫు ప్రతినిధులే ఉండటంతో వారి సంతకమే తీసుకున్నట్లు వివరణ
  • పోలింగ్ మొదలయ్యాక అన్ని పార్టీల ఏజెంట్ల సంతకాలు తీసుకున్నట్లు స్పష్టీకరణ

దేశంలో ఓవైపు శనివారం లోక్ సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ కొనసాగుతున్న తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సంచలన ఆరోపణలు చేసింది. 

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందంటూ ఆరోపించింది. బంకురాలోని రఘునాథ్ పూర్ లో ఐదు ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్ లు కనిపించాయంటూ ఫొటోలను పార్టీ సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ ద్వారా విడుదల చేసింది.  

అందువల్ల బీజేపీపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చింది. 

ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసేటప్పుడు ఆయా పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటామని వివరించింది. 

కానీ రఘునాత్ పూర్ లో కేవలం బీజేపీ తరఫు ప్రతినిధులు మాత్రమే ఉండటంతో ఈవీఎం, వీవీ ప్యాట్ యంత్రంపై వారి సంతకం మాత్రమే తీసుకోవడం కుదిరిందని సోషల్ మీడియా వేదికగా బదులిచ్చింది. పూర్తిగా సీసీటీవీ కవరేజీలోనే ఈ ప్రక్రియ జరిగిందని స్పష్టం చేసింది. 

అయితే పోలింగ్ మొదలయ్యాక అక్కడ (పోలింగ్ స్టేషన్ నంబర్లు 56, 58, 60, 61, 62) అన్ని పార్టీల ఏజెంట్ల సంతకాలను సేకరించినట్లు వెల్లడించింది. ఈ విషయంలో ఎన్నికల నిబంధనలన్నింటినీ అనుసరించామని ఈసీ తెలిపింది. పైగా ఈ ప్రక్రియను పూర్తిగా వీడియో కూడా తీశామని వివరించింది.

లోక్ సభ ఎన్నికల ఆరో దశలో భాగంగా పశ్చిమ బెంగాల్ లో ఆరు స్థానాలకు ( తమ్ లుక్, కాంతి, ఘటాల్, ఝార్ గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకూరా) శనివారం పోలింగ్ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News