అధికారంలో ఉన్నప్పుడే ఉద్యోగాలు ఇవ్వలేదు.. ఇప్పుడు ఎలా ఇస్తుంది?: ఈటల
- బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించిన బీజేపీ నేత
- పట్టభద్రులను చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపు
- కొత్తగూడెంలో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరఫున ఈటల ప్రచారం
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఈటల ఆరోపణలు గుప్పించారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం వైఎస్ హయాంలో మండలాల వారీగా కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచినా సరే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షనే గెలిచిందని గుర్తుచేశారు. ఉద్యమ ఆకాంక్షలను మరోసారి గుర్తుతెచ్చుకుని, రాష్ట్రానికి అన్యాయం చేసిన చేస్తున్న పార్టీలకు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గుణపాఠం నేర్పించాలని అన్నారు. నోటుతో ఓటును కొనాలని చూసే వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
గతంలో కాంగ్రెస్ పాలన మొత్తం అవినీతి, స్కాంలతో నిండిపోయిందని, కోల్, 2జీ వంటి స్కాంలు జరిగాయని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. మోదీ పదేళ్ల పాలనలో ఒక్క స్కాం కూడా లేదని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు గడిచినా హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
డిక్లరేషన్ల పేరుతో ఎన్నికల సమయంలో హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ హామీల అమలును గాలికి వదిలేసిందని మండిపడ్డారు. సగటు భారతీయుడిని గర్వంగా జీవించేలా చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలవాలని, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఈటల పిలుపునిచ్చారు.