కర్నూలు జిల్లాలో పొలం దున్నుతుంటే రైతు కంటపడ్డ వజ్రం
- పొలం పనులు చేస్తుండగా కంటపడిన డైమండ్
- మద్దికేర మండలం హంప గ్రామంలో ఘటన
- ఇటీవలి వర్షాలతో జిల్లాలో మొదలైన వజ్రాల వేట
ఏటా వర్షాకాలం తొలకరి సమయంలో కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు, కూలీలు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు వెతుకుతుంటారు. దీనికోసం ప్రత్యేకంగా భూమిని లీజుకు తీసుకుని, కూలీలను పెట్టి వెతికించే వాళ్లు కూడా ఉన్నారు. ఒక్క విలువైన వజ్రం దొరికితే దశ మారిపోయే అవకాశం కావడంతో రైతులు కూడా తమ పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు హంప గ్రామానికి చెందిన రైతు పొలంలో పనులు చేస్తుండగా ఈ విలువైన వజ్రం దొరికింది.
కాగా, భూమిలో దొరికే విలువైన వజ్రాలు, గుప్త నిధులు వంటివి చట్టప్రకారం ప్రభుత్వ ఖజానాకు చేర్చాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూముల్లో దొరికినా సరే అది ప్రభుత్వ ఆస్తేనని చట్టాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రైతుకు దొరికిన వజ్రాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అధికారులు.. తమకు పట్టనట్టు ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.