Hyderabad News: ప్రియురాలి ఇంటికి ప్రియుడు.. దొంగనుకుని చావబాదిన తండ్రి

Lover beaten by girl father as he mistaken as thief
  • హైదరాబాద్‌లోని పాతబస్తీ బండ్లగూడలో ఘటన
  • గతంలో బాలికను ఇంట్లోంచి తీసుకెళ్లిన కేసులో జైలుకు
  • 45 రోజుల అనంతరం బయటకు వచ్చిన నిందితుడు
  • తాజాగా బాలిక ఇంటికి వెళ్లి ఆమె తండ్రికి చిక్కిన వైనం
  • భయపడి గదిలోకి వెళ్లి డయల్ 100కు ఫోన్
  • తల్లిదండ్రులతో కలిసి వచ్చి విడిపించిన పోలీసులు

ప్రియురాలిని కలుసుకునేందుకు తెల్లవారుజామున ఆమె ఇంటికి వెళ్లాడో ప్రియుడు. అలికిడికి లేచిన ఆమె తండ్రి దొంగ చొరబడ్డాడనుకుని పట్టుకుని చావబాదాడు. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బండ్లగూడ గౌస్‌నగర్‌కు చెందిన అబ్దుల్ సోహైల్ (25) పక్క బస్తీలోని ఓ వ్యక్తి భవనంలో ఏడాది క్రితం గ్లాస్ ఫిటింగ్ వర్క్ చేశాడు. ఆ సమయంలో ఆయన కుమార్తె(17)పై మనసు పడ్డాడు. ఆ తర్వాత అది మరింత ముదరడంతో బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోంచి తీసుకెళ్లాడు. 

బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోహైల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. 45 రోజుల అనంతరం జైలు నుంచి ఇటీవల బయటకు వచ్చిన సోహైల్ నిన్న తెల్లవారుజామున 4 గంటల సమయంలో బాలిక ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో నమాజు కోసం లేచిన బాలిక తండ్రి యువకుడిని చూసి దొంగనుకుని పట్టుకుని చితకబాదాడు. ఆ తర్వాత అతడిని సోహైల్‌గా గుర్తించాడు.

తననేమైనా చేస్తాడేమోనని భయపడిన నిందితుడు వెంటనే ఓ గదిలోకి దూరి డోర్ వేసేసుకున్నాడు. ఆపై డయల్ 100కు ఫోన్ చేసి తన పరిస్థితి వివరించాడు. యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు వారితో కలిసి బాలిక ఇంటికి వెళ్లి యువకుడిని బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News