Pune Accident Case: పూణె యాక్సిడెంట్ కేసు.. ఇద్దరు పోలీసు అధికారులపై వేటు

2 Pune cops suspended for not informing seniors about Porsche crash in time
  • ప్రమాదం గురించి పైఅధికారులకు వెంటనే చెప్పని ఇద్దరు పోలీసులపై వేటు
  • కేసు పకడ్బందీగా ఫైల్ చేశామన్న పోలీసులు
  • యాక్సిడెంట్ నేరాన్ని డ్రైవర్ పై నెట్టే ప్రయత్నం జరిగిందని వ్యాఖ్య
  • లోతైన దర్యాప్తు చేస్తున్నామని వెల్లడి

పూణె యాక్సిడెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యాక్సిడెంట్ విషయం గురించి పైఅధికారులకు సమయానికి సమాచారం అందించని ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. యరవాడ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాహుల్ జగ్దలే, అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ తోడ్కరీపై వేటు వేశారు.  

ఆదివారం పూణెలోని కమలా నగర్‌లో ఓ టీనేజర్ తన తండ్రి కారుతో ఢీకొట్టడంతో ఇద్దరు టెకీలు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీనేజర్‌ను తప్పించే ప్రయత్నాలు జరగడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు అతడి బెయిల్ రద్దు చేసి జువెనైల్ బోర్డుకు అప్పగించింది. 

మరోవైపు, ఘటనా స్థలంలో ఆధారాలు చెరిపేందుకు ప్రయత్నాలు జరిగాయని కూడా పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో డ్రైవర్ కారునడిపినట్టు చూపించే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. నిందితుడు బార్ లో మద్యం తాగినట్టు సీసీటీవీ ఫుటేజీ కూడా లభించిందని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో టీనేజర్ పూర్తి స్పృహలో ఉన్నాడని. ఆ సమయంలో తాను ఏం చేస్తున్నదీ అతడికి తెలుసని చెప్పారు. 

నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించాక పిజ్జా ఇచ్చారన్న ఆరోపణలపై పోలీసులు స్పందించారు. పోలీస్ స్టేషన్ లో ఎటువంటి పిజ్జా పార్టీ జరగలేదని స్పష్టం చేశారు. అయితే, ఆ రోజు ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. ‘‘కేసును పకడ్బందీగా ఫైల్ చేశాము. ఇప్పటికే టీనేజర్ తండ్రి, బార్ ఓనర్లపై కేసు నమోదు చేశాము. ఆధారాల సాంకేతిక విశ్లేషణ కూడా జరుగుతోంది’’ అని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు విశాల్ భరద్వాజ్ తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారందరికీ కోర్టు జూన్ 7 వరకూ జుడీషియల్ రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News