Narendra Modi: నెహ్రూ రికార్డు సమం చేయనుండడంపై ప్రధాని మోదీ స్పందన

On Equalling Jawaharlal Nehrus 3 Term Record PM Modi Says this
  • ఎన్ని పర్యాయాలు ప్రధానిగా చేశారన్నది ముఖ్యంకాదన్న మోదీ
  • దేశం ఎంతగా అభివృద్ది చెందిందో చూడాలని కామెంట్
  • వైఫల్యం, విజయాల బాధ్యత తీసుకునేందుకు తాను వెనకాడనన్న ప్రధాని
  • జాతీయ మీడియాతో ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పలు విషయాలపై స్పందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న అంచనాల నడుమ వరుసగా మూడు సార్లు ప్రధానిగా చేసిన జవహర్ లాల్ నెహ్రూ రికార్డును తాను సమం చేయనుండడంపై మోదీ తాజాగా స్పందించారు. 

‘‘గుజరాత్ లో అనలిస్టులు నా గురించి అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తి అని రాసేవారు. విశ్లేషకుల పని ఇదే. కానీ ఒకరు ఎన్ని పర్యాయాలు ప్రధానిగా పనిచేశారన్నది ముఖ్యం కాదు. దేశం ఎంతగా అభివృద్ధి చెందిందన్నది ముఖ్యం. మోదీ మూడు సార్లు, ఐదు సార్లు లేదా ఏడు సార్లు గెలవొచ్చు. 140 కోట్ల మంది ప్రజల దీవెనలు నాకున్నాయి. కాబట్టి ఇది కొనసాగుతూనే ఉంటుంది’’ అని ఆయన అన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ  1947 నుంచి 1964 వరకు ప్రధానిగా వ్యవహరించారు. ఇందులో 1952, 1957, 1962 ఎన్నికల్లో గెలిచి వరుసగా మూడు సార్లు ప్రధానిగా చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 

కాగా చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడిపై దిగిన ప్రదేశానికి శివశక్తి అన్న పేరు పెట్టడంపై కూడా మోదీ వివరణ ఇచ్చారు. ‘‘ఆ ప్రాంతానికి వేరే పేరు పెట్టి ఉండొచ్చు. ప్రతిపక్షం అధికారంలో ఉండి ఉంటే వారి కుటుంబం పేరు పెట్టేవారు. కానీ నేను అలా చేయలేను. ప్రపంచానికి భారత్ ఓ తత్వాన్ని పరిచయం చేసింది. కాబట్టి విశ్వాన్ని మొత్తం నడిపించే శివశక్తి పేరు పెట్టడంపై నేను గర్వపడుతున్నాను. 140 కోట్ల మంది ప్రజలకు చేరువయ్యే పేరిది. అదే కుటుంబం పేరు పెట్టి ఉంటే కేవలం కొందరికి మాత్రం కనెక్ట్ అయ్యి ఉండేది’’ అని ఆయన అన్నారు. 

ప్రభుత్వ విజయాలను మోదీ తన ఖాతాలో వేసుకుంటున్నారన్న ప్రతిపక్షాల విమర్శపై కూడా మోదీ స్పందించారు. ‘‘భారత విజయాలను చూసి మనం గర్విస్తున్నామా? లేదా? అనేది ఇక్కడ మొదటి విషయం. అసలు ఈ విజయాలను చూసి గర్వించడంలో తప్పేమిటో నాకు అర్థం కావట్లేదు. మోదీ క్రెడిట్ ఎందుకు తీసుకుంటున్నారని వాళ్లు అంటారు. ఈ విజయాలను చూసి సంతోషించకుండా క్రెడిట్ మొత్తం తమకే చెందాలని వారు కోరుకుంటున్నారు. అటల్ బీహారీ వాజ్‌పేయ్ అధికారంలో ఉన్నప్పుడు అణుబాంబు ప్రయోగం నిర్వహించాం. అప్పట్లో సైంటిస్టులు ఇదంతా చేశారని ప్రతిపక్షం అంది. ఆ తరువాత 13 రోజులకు మరో అణువిస్ఫోటనం చేశాం. చంద్రయాన్ - 2 విఫలమైనప్పుడు ఆ బాధ్యత తీసుకునేందుకు నేను సైంటిస్టుల పక్కనే ఉన్నాను. అక్కడి నుంచి పారిపోలేదు’’ అని మోదీ అన్నారు.

  • Loading...

More Telugu News