Narendra Modi: 2047 వరకు పని చేయాలని దేవుడు నన్ను ఆజ్ఞాపించాడు: ప్రధాని మోదీ

PM Modi said that God has ordained that I should continue to work till 2047
  • ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు దేవుడు పంపించాడన్న ప్రధాని
  • 2047 నాటికి లక్ష్యాన్ని సాధిస్తానన్న నరేంద్ర మోదీ
  • ఓ జాతీయ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన కోసం తాను 2047 వరకు 24 గంటలపాటు పనిచేసేలా దేవుడే తనను నియమించాడని విశ్వసిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రత్యేక కార్యసాధన కోసం భగవంతుడు తనను పంపించాడని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘‘ దేవుడు నాకు మార్గం చూపిస్తున్నాడు. దేవుడు నాకు శక్తి ఇస్తున్నాడు. 2047 నాటికి లక్ష్యాన్ని సాధిస్తానని నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేవుడు నన్ను వెనక్కి పిలవబోడు. ప్రపంచంలో ఇక్కడ తప్ప మరెక్కడా నాకు చోటులేదు’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికల్లో ‘ఈసారి 400 సీట్లు’ అనే నినాదం బీజేపీది కాదని, ఇది ప్రజల నినాదమని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో పార్లమెంట్‌లో తమకు 400 సీట్ల సామర్థ్యం ఉందని, ఇతర పార్టీల నుంచి ఈ మేరకు తమకు మద్దతు లభించిందని పేర్కొన్నారు. 95 శాతం మార్కులు పొందిన విద్యార్థి సహజంగా మరింత ఎక్కువ టార్గెట్‌ని నిర్దేశించుకుంటారని మోదీ సమర్థించుకున్నారు.

ఇక ఎన్నికల సంఘం విశ్వసనీయత, పారదర్శకతపై కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. 1991 మే 21న కాంగ్రెస్‌ నాయకుడు రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారని, అయితే అప్పటికే ఒక దశ పోలింగ్‌ జరిగిన తర్వాత కూడా నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (టీఎన్‌ శేషన్‌) దేశవ్యాప్తంగా 22 రోజులపాటు ఎన్నికలు వాయిదా వేశారని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘మరి ఇది పారదర్శకతా?’ అని ప్రధాని మోదీ విపక్షాలను ప్రశ్నించారు.

 సాధారణంగా అభ్యర్థి మరణిస్తే ఆ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నికలను వాయిదా వేస్తారని, కానీ 1991లో దేశవ్యాప్తంగా ఎన్నికలను వాయిదా వేశారని మోదీ విమర్శించారు. నాయకుడి మరణం గురించి విస్తృతంగా ప్రచారం చేసుకున్న తర్వాత మాత్రమే ఎన్నికలను నిర్వహించారని ఎద్దేవా చేశారు. ఇక నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ (టీఎన్ శేషన్) పదవీ విరమణ తర్వాత కాంగ్రెస్ టిక్కెట్‌పై గాంధీనగర్‌లో తమ పార్టీ అధ్యక్షుడిపై (ఎల్‌కే అద్వానీ) పోటీ చేశారని మోదీ ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News