KTR: జూపల్లి ప్రమేయంతోనే మా నాయకుడి హత్య... రేవంత్ రెడ్డి ఆయనను బర్తరఫ్ చేయాలి: కేటీఆర్

KTR demands for jupalli Krishna rao birthruff
  • కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య
  • ఈ హత్యకు ప్రభుత్వం, జూపల్లి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్
  • మంత్రిగారి ప్రోద్భలం... ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణానికి తెగబడరని వ్యాఖ్య
  • స్థానిక పోలీసులపై నమ్మకం లేదన్న కేటీఆర్
  • సిట్ లేదా జ్యుడీషియల్ విచారణకు డిమాండ్
  • రాహుల్ గాంధీ చెప్పే మొహబ్బత్ కీ దుకాణ్ ఇదేనా? అని నిలదీత

తెలంగాణలో లేని ఫ్యాక్షన్ సంస్కృతిని మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ప్రాంతానికి తీసుకువచ్చారని... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో హత్యకు గురైన పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి వెళ్లి ఆయన పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... తమ పార్టీ నాయకుడి హత్యకు ప్రభుత్వం, మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇది రెండో హత్య అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన కాదని... ప్రతీకార పాలన అని మండిపడ్డారు.

'దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. తెలంగాణలో ఎక్కడాలేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఈ మంత్రి (జూపల్లి) కొల్లాపూర్‌కు తీసుకు వచ్చారు. జనవరిలో మల్లేశ్ యాదవ్ మృతికి, ఈరోజు శ్రీధర్ రెడ్డి మృతికి జూపల్లి కారణమయ్యారు. ఒకటే నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయంటే మంత్రిగారి ప్రోద్భలం... ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణానికి తెగబడరు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మంత్రిని బర్తరఫ్ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మాకు స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదు. సిట్‌ను ఏర్పాటు చేయాలి లేదా జ్యుడీషియల్ విచారణ జరిపించాలి. ఈ హత్యలో ప్రభుత్వం, మంత్రి పాత్ర లేకుంటే నిష్పక్షపాతంగా విచారణ జరిగేందుకు సహకరించాల'ని డిమాండ్ చేశారు.

కొల్లాపూర్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్నారంటూ గతంలోనే తమ పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గువ్వల బాలరాజులు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారన్నారు. పోలీస్ యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆరోపించారు. స్థానిక ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేరు మాత్రమే ప్రజాపాలన... కానీ ప్రతీకారంతో మాత్రమే బ్రతుకుతాం... దాడులు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు భావిస్తే మూర్ఖత్వమే అవుతుందన్నారు. ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మా వారిని నియంత్రించే పరిస్థితి కూడా మాకు ఉండదని హెచ్చరించారు. కాబట్టి తెలంగాణలో దాడుల సంస్కృతికి అడ్డుకట్ట వేయాలన్నారు. లక్ష్మీపల్లిని అవసరమైతే కల్లోల ప్రాంతంగా ప్రకటించాలన్నారు.

ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా వేలసంఖ్యలో వెళ్లి మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. రాహుల్ గాంధీ చెబుతున్న మొహబ్బత్ కీ దుకాణ్ ఇవేనా? దాడులే మీ సంస్కృతా? అని నిలదీశారు. హత్యలు, ప్రతిపక్ష నాయకులపై దాడులు ఏమిటన్నారు. మాకు ఓపిక నశిస్తే.. అప్పుడు పూర్తి బాధ్యత ప్రభుత్వం, రేవంత్ రెడ్డి తీసుకోవాలన్నారు. ఇలాంటి సంస్కృతికి తెరదించుదామని పిలుపునిచ్చారు. శ్రీధర్ రెడ్డి కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News