brain power: ఈ పదీ అలవాటు చేసుకుంటే.. మీ బ్రెయిన్​ పవర్​ ఫుల్​!

10 habits makes your brain powerful
  • చిన్నపాటి వ్యాయామాల నుంచి చన్నీటి స్నానం దాకా ఎన్నో మార్గాలు
  • మెదడుకు పదును పెడుతూ ఉంటే మరింత పవర్
  • ఏమేం చేయాలన్న దానిపై ఆరోగ్య నిపుణులు చేస్తున్న సూచనలివీ..

పొద్దున్న లేస్తే సవాలక్ష పనులు. ఒత్తిళ్లతో మెదడు మొద్దుబారిపోతుంటుంది. చురుగ్గా ఉండలేకపోతుంటాం. ఏకాగ్రత కుదరదు. కానీ ఈ సమస్యలను తప్పించి మెదడు చురుగ్గా, పవర్ ఫుల్ గా పనిచేసేందుకు పది రకాల అలవాట్లు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వీటితో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా శక్తితోపాటు మొత్తంగా మెదడు శక్తిమంతం అవుతుందని వివరిస్తున్నారు. ఆ సూచనలు ఏమిటో చూద్దామా..

శారీరక కదలికలు, వ్యాయామం
వ్యాయామం, శారీరక కదలికలు శరీరంలో రక్త సరఫరా తగిన విధంగా ఉండేలా చూస్తాయి. ముఖ్యంగా మెదడుకు రక్త సరఫరా పెరిగి.. ఆక్సిజన్, పోషకాలు తగిన స్థాయిలో అందుతాయి. అందుకని మరీ కఠిన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదని.. ఏరోబిక్ వ్యాయామాలు, నడక, జాగింగ్ వంటివి కూడా సరిపోతాయని నిపుణులు చెప్తున్నారు.

మెదడుకు శక్తినిచ్చే ఆహారం
యాంటీ ఆక్సిడెంట్లు, మంచి ఫ్యాట్స్, విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారం తీసుకుంటే.. మెదడుకు సంబంధించి సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా కూరగాయలు, బెర్రీస్, చేపలు, డ్రైఫ్రూట్స్ వంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

తగినంత మంచి నిద్ర
మనం నిద్రపోయినప్పుడు మెదడు.. మన జ్ఞాపకాలు, కొత్తగా నేర్చుకున్న అంశాలను క్రమపద్ధతిలో స్టోర్ చేసుకుంటుంది. రోజువారీ ప్రక్రియల్లో ఉత్పత్తయ్యే విష పదార్థాలు, వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. అలాగని ఎక్కువ సేపు నిద్రపోవడం కాదు. తగినంత సమయం, పూర్తి గాఢనిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి.

 ధ్యానం చేయడం
రోజూ కాసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం వల్ల మెదడులోని గ్రేమేటర్ పెరుగుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల్లో తేలింది. మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి, జ్ఞాపకశక్తికి, ఉద్వేగాలను నియంత్రించుకోవడానికి ఈ గ్రే మేటరే కీలకం. 

సోషల్ యాక్టివిటీస్..
స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడం, హృదయపూర్వక సంబంధ బాంధవ్యాలను నెరపడం కూడా మెదడు చురుగ్గా, శక్తిమంతంగా ఉండటానికి తోడ్పడుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. ఈ అలవాటు వృద్ధాప్యంలో మతిమరపు రాకుండా కూడా చూస్తుందట.

మెదడుకు మేత.. పజిల్స్..
ఏదైనా చదువుతూ ఉండటం, పజిల్స్, కొత్త సబ్జెక్టులను నేర్చుకోవడం వంటివి మెదడు పనితీరును బాగా మెరుగుపరుస్తాయని అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధనల్లో తేలింది. మెదడుకు ఎప్పుడూ పనిచెప్తుండటం వల్ల న్యూరోప్లాస్టిసిటీ అంటే మెదడు కణాలు యాక్టివ్ గా ఉండటాన్ని పెంచుతుందట.

కొత్త భాష, కొత్త వాయిద్యం నేర్చుకోవడం..
ఏదైనా కొత్త భాషను, కొత్త వాయిద్యాన్ని నేర్చుకోవడం వంటివి మెదడులోని వివిధ భాగాలను యాక్టివేట్ చేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శరీరంలోని చేతులు, కాళ్లు, చర్మం, కళ్లు వంటి అవయవాలను నియంత్రించే సామర్థ్యం మరింత పెరుగుతుందని.. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను ఇది దూరంగా ఉంచుతుందని వివరిస్తున్నారు.

చేతి రాతను ప్రాక్టీస్ చేయడం
మంచి చేతి రాతను ప్రాక్టీస్ చేయడం కూడా మెదడు పనితీరును, మోటార్ స్కిల్స్ ను పెంచుతుందట. ఇది భాష, ఆలోచనా శక్తి వంటి వాటిని మెరుగుపరుస్తుందట.

కాసేపు చల్లటి నీటిలో స్నానం చేయడం
రోజూ కాసేపు చల్లటి నీటిలో స్నానం చేయడం వల్ల శరీరంలో వేగస్ నాడీ స్టిమ్యులేట్ అవుతుందట. నోరాడ్రినలిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుందట. ఇది యాంగ్జైటీని తగ్గించి.. మెదడు చురుగ్గా చేస్తుందట.

పాజిటివ్ దృక్పథాన్ని పెంచుకోవడం
నెగెటివ్ ఆలోచనలను దూరం పెట్టి.. పాజిటివ్ థింకింగ్ ను పెంచుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లు తగ్గిపోతాయట. మానసిక ఆరోగ్యం బాగుంటే మెదడు పనితీరు బాగుంటుందని.. జీవితకాలం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

  • Loading...

More Telugu News