KTR: మొదటిసారి మోసపోతే సరే.. మళ్లీ మోసపోతే మాత్రం తప్పే: కేటీఆర్

BRS Working President KTR Speech
  • రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి విమర్శలు 
  • డిసెంబర్ 9 నే రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపాటు
  • ఆరు నెలల కిందటి పరిస్థితికి నేటి పరిస్థితికి తేడా చూడాలని యువతకు పిలుపు

ఒకసారి మోసపోతే అది మోసపోయిన వారి తప్పుకాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, రెండోసారి కూడా మోసపోతే మాత్రం తప్పు మోసపోయిన వారిదేనని తేల్చిచెప్పారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉద్దేశిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతుల రుణాలను డిసెంబర్ 9నే మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ రైతాంగం ఆ హామీని అమాయకంగా నమ్మి ఓట్లేశారని, కాంగ్రెస్ సర్కారు మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు.

రైతు రుణమాఫీ విషయంలో ఒకసారి నమ్మినందుకు రైతాంగాన్ని కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15 లోగా రైతుల రుణాలు మాఫీ చేస్తామంటూ మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ నమ్మితే మోసపోవడం తప్పదని, అప్పుడు తప్పు కాంగ్రెస్ వాళ్లది కాదు, వాళ్ల హామీలను నమ్మిన మనదేనని చెప్పారు.

ఆరు నెలల కిందట రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందనేది జాగ్రత్తగా గమనించాలంటూ రాష్ట్ర యువతకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అప్పటికి, ఇప్పటికి వచ్చిన మార్పులు చూడాలని చెప్పారు. ఆరు నెలల పాలనలోనే రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని గుర్తించాలని సూచించారు. ‘రైతు భరోసా పేరుతో ఇస్తామన్న రూ. 15 వేలు ఇచ్చారా.. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. చేశారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News