AC Compartment: ఏసీ బోగీలో సూట్ కేసులు కొరికేసిన ఎలుకలు!

Rats Damage Suitcases on Jnaneswari Express Netizens Demand Compensation
  • కోల్ కతా–ముంబై జ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికులకు చేదు అనుభవం
  • తనకు జరిగిన నష్టాన్ని సోషల్ మీడియాతో పంచుకున్న ఓ బాధితుడు
  • స్పందించిన రైల్వే శాఖ.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ

అటకపై పెట్టిన వస్తువులను ఎలుకలు కొరకడం సహజమే.. కానీ అదే సంఘటన కదులుతున్న రైల్లో జరిగితే..! అది కూడా లగ్జరీ ప్రయాణానికి కేరాఫ్ గా చెప్పే ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో చోటుచేసుకుంటే? కొందరు రైలు ప్రయాణికులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. కోల్ కతా నుంచి ముంబైకి వెళ్లే జ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ లో గత శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఓ బాధితుడు రైల్వే శాఖ తీరుపై మండిపడ్డాడు. ఎలుకలు తన సూట్ కేసులు ఎలా కొరికాయో చూడండంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోను పెట్టాడు. వాటిని చూసిన నెటిజన్లంతా అవాక్కయ్యారు. 

‘12102 రైలు నంబర్ లో మే 19న ఎక్కా. కోచ్ హెచ్ 1, ఏ2 సీట్లో ప్రయాణించా. నా పీఎన్ ఆర్ నంబర్ 6535087042. నా సూట్ కేసులను ఎలుకలు కొరికేశాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు అర గంట నుంచి టీసీ కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ ఓ ప్రయాణికుడు తన ‘ఎక్స్’ ఖాతాలో ఫొటోలు, వీడియో షేర్ చేశారు.

దీనిపై రైల్వే శాఖ స్పందించింది. ‘ఈ విషయం చాలా ఆందోళన కలిగిస్తోంది. మీకు వీలైనంత వెంటనే సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రైల్వే డివిజనల్ మేనేజర్ ద్వారా మీ ఫోన్ నంబర్ సేకరించాల్సి ఉంది. మీరు కావాలంటే railmadad.indianrailways.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే 139కు డయల్ చేసి సత్వర పరిష్కారం పొందొచ్చు’ అని తెలిపింది.

అయితే రైల్వే శాఖ తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. రైళ్లలో శుచీశుభ్రత ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ఇది సేవా లోపం కిందకు వస్తుందని చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నామనే పేరుతో భారీగా చార్జీలు వసూలు చేస్తున్న రైల్వే శాఖ.. ఎలుకలు కొరకడంతో లగేజీ పాడైన ప్రయాణికులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చిలోనూ ఈ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. భువనేశ్వర్–జునాగఢ్ ఎక్స్ ప్రెస్ లోని ఏసీ బోగీలో ఎలుకల సంచారాన్ని ఓ ప్రయాణికురాలు గుర్తించింది. అలాగే గతేడాది అక్టోబర్ లో మడ్గావ్ ఎక్స్ ప్రెస్ లోని ప్యాంట్రీ కార్ లో ఆహార పదార్థాలపై ఎలుకలు పరుగులు తీసిన దృశ్యం ప్రయాణికులను కలవరపరిచింది.

  • Loading...

More Telugu News