Tiger: హైవేపై అర్ధరాత్రి పెద్ద పులిని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్

Speeding Hyundai Creta Fatally Hits Tiger in Maharashtra Sanctuary Video Goes Viral
  • నుజ్జునుజ్జయిన ముందు కాళ్లు.. బాధతో విలవిల్లాడిన పులి
  • అయినా డేకుతూనే రోడ్డు పక్కనున్న పొదల్లోకి వెళ్లిన వైనం
  • ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి 
  • విషాదకర సంఘటన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన యూజర్
  • పులి మృతికి కారకుడైన కారు డ్రైవర్ పై మండిపడ్డ నెటిజన్లు
మహారాష్ర్టలోని భండారా–గోండియా హైవేపై విషాదం చోటుచేసుకుంది. నావెగావ్ నగ్జీరా శాంక్చువరీ సమీపంలో అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఓ పులిని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులి తీవ్రంగా గాయపడింది. దాని ముందు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో అది బాధతో విలవిల్లాడుతూ గాండ్రించింది. వెనక కాళ్లతోనే డేకుతూ రోడ్డుపక్కనున్న పొదల్లోకి వెళ్లి పడిపోయింది. చివరకు మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఆ వీడియోలో ఓ పెద్ద మగ పులి రోడ్డుపై పడిపోగా దాని ముందు ఓ హ్యుండాయ్ క్రెటా కారు ఆగి ఉంది. పూర్తిగా నలిగిపోయిన ముందటి కాళ్లతో పులి ఎలాగోలా రోడ్డు దాటి పొదల్లోకి వెళ్లిపోయింది. మరో కారులో వస్తున్న ఓ వ్యక్తి ఈ ప్రమాదాన్ని వీడియో తీసి తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశాడు. గాయపడ్డ పులిని కాపాడేందుకు నాగ్ పూర్ లోని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూసిందని పేర్కొన్నాడు. అభయారణ్యం మీదుగా ప్రయాణించేటప్పుడు వాహనాలు నెమ్మదిగా నడపాలని హెచ్చరిక బోర్డులు ఉన్నా క్రెటా కారు డ్రైవర్ పట్టించుకోలేదని విమర్శించాడు. ఎన్ హెచ్ 753లో భాగంగా అటవీ ప్రాంతంలోని ఈ మార్గం సింగిల్ రోడ్డు అని, ఇక్కడ గంటకు సగటున 40 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.

మరోవైపు నిర్లక్షంగా కారు నడిపి పెద్ద పులి మరణానికి కారకుడైన కారు డ్రైవర్ పై నెటిజన్లు మండిపడ్డారు. అడవులు లేదా వన్యప్రాణులు సంచరించే మార్గాల్లో ప్రజలు ఎందుకు వేగంగా వాహనాలు నడుపుతారని ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదనుకుంటే రాత్రి వేళల్లో అటవీ మార్గాలను మూసేయాలని ఓ యూజర్ సూచించాడు. కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణుల పరిరక్షణ విషయంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు.
Tiger
Hit
Car
Road Accident
Maharashtra
NH 753
Succumbs

More Telugu News