KTR: కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు: కేటీఆర్

KTR said that 6 decades of tearful scenes discovered within 6 months of Congress rule
  • 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమయ్యాయన్న కేటీఆర్  
  • పదేళ్ల తర్వాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నామని విమర్శలు 
  • అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదంటూ వ్యాఖ్య  
‘‘కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు! అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు!’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అని  ఆయన వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విత్తనాల కోసం వెళ్లిన రైతులు క్యూలైన్‌లో నిలబడలేక అవస్థలు ఎదుర్కొన్న పరిస్థితులను ఉద్దేశించి కేటీఆర్ ఈ విధంగా స్పందించారు. రైతులు ఎక్కువసేపు నిలబడలేక తమ వెంట తెచ్చుకున్న పాస్‌బుక్ కవర్లను క్యూలైన్‌గా పేర్చిన ఫొటోని కేటీఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు: కేటీఆర్
6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం అయ్యాయని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదేళ్లపాటు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నామని, విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నామని అన్నారు. కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్‌ఫార్మర్లు కనిపిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నామని, సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూడాల్సి వస్తోందన్నారు. ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నామని, చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు ఇవ్వడం చూస్తున్నామని, రైతుబంధు కోసం రైతన్నలు నెలలపాటు పడిగాపులు పడడం కనిపిస్తోందని, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నామని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.
KTR
BRS
Congress
Telangana
TS Politics

More Telugu News