Virat Kohli: విరాట్ కోహ్లీ భారీ మైలురాయి.. తొలి భారతీయ క్రికెటర్‌గా అవతరణ!

Virat is the second player overall to reach 700 run mark in a single IPL edition on two or more occasions
  • ఐపీఎల్‌లో రెండు వేర్వేరు సీజన్లలో 700లకుపైగా బాదిన తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డు
  • ప్రస్తుత సీజన్‌తో పాటు 2016లోనూ 700 ప్లస్ రన్స్ సాధించిన విరాట్
  • కోహ్లీ కంటే ముందు ఈ మైలురాయి సాధించిన ఏకైక క్రికెటర్ క్రిస్ గేల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సంచలనాత్మక రీతిలో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడంలో కింగ్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌తో చెలరేగి ఆడాడు. శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లోనూ మెరిశాడు. 29 బంతుల్లో 47 పరుగులు బాదాడు. 162.06 స్ట్రైక్ రేట్‌తో ముగిసిన కోహ్లీ ఇన్నింగ్స్‌లో ఏకంగా 4 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో బాదిన 47 పరుగులతో విరాట్ కోహ్లీ భారీ మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో రెండు వేర్వేరు ఎడిషన్లలో 700లకుపైగా పరుగులు చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా అవతరించాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో విరాట్ కోహ్లీ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 64.36 సగటు, 155.60 స్ట్రైక్ రేట్‌తో 708 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు బాదిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతకుముందు 2016 ఎడిషన్‌లో కూడా విరాట్ 700 పరుగుల మార్క్‌ను అధిగమించాడు. ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఏకంగా 81.08 సగటుతో రికార్డు స్థాయిలో 973 పరుగులు బాదాడు. ఈ సీజన్‌లో 152 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు సాధించాడు.

కాగా విరాట్ కోహ్లీ కంటే ముందు ఐపీఎల్‌లో రెండు సార్లు 700 పరుగుల మైలురాయిని అధిగమించిన ఏకైక ఆటగాడిగా క్రిస్ గేల్ ఉన్నాడు. క్రిస్ గేల్ కూడా రెండుసార్లు 700లకుపైగా పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2012లో 733 పరుగులు, ఐపీఎల్ 2013లో 708 పరుగులు బాదాడు.

కోహ్లీ మరో రికార్డు
మరోవైపు చెన్నై మ్యాచ్‌లో 29 బంతుల్లో 54 పరుగులు బాదిన విరాట్ కోహ్లీ ఈ సీజన్‌ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 37 సిక్సర్లు బాదాడు. 36 సిక్సర్లతో నికోలస్ పూరన్ రెండో స్థానంలో, 35 సిక్సర్లతో అభిషేక్ శర్మ మూడో స్థానంలో, 32 సిక్సర్లతో సునీల్ నరైన్ నాలుగో స్థానంలో, 31 సిక్సర్లతో ట్రావిస్ హెడ్ 5వ స్థానాల్లో నిలిచారు. మరోవైపు ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ పరుగులు 700 మైలురాయిని దాటాయి.

  • Loading...

More Telugu News