Rahul Gandhi: 42 ఏళ్ల క్రితం నా తండ్రితో కలిసి ఇక్కడకు వచ్చా: రాహుల్ గాంధీ

42 years back I came to came to Amethi with my father says Rahul Gandhi
  • తన తండ్రికి, అమేథీకి ఉన్న ప్రేమానుబంధానికి తానే సాక్షినన్న రాహుల్
  • రాజకీయాల గురించి తాను అమేథీ నుంచే నేర్చుకున్నానని వ్యాఖ్య
  • రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ భావిస్తున్నారని విమర్శ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ తో పాటు, ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు అమేథీలో ఆయన ప్రసంగిస్తూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను గుర్తు చేసుకున్నారు. 42 ఏళ్ల క్రితం తన తండ్రి రాజీవ్ గాంధీతో కలిసి తొలిసారి తాను అమేథీకి వచ్చానని చెప్పారు. రాజకీయాల గురించి తాను ఏది నేర్చుకున్నా అది అమేథీ నుంచేనని... అమేథీ ప్రజలే తనకు అన్నీ నేర్పారని అన్నారు. తన తండ్రికి, అమేథీ ప్రజలకు ఉన్న ప్రేమానుబంధానికి తానే సాక్షినని చెప్పారు. 

తాను రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ... అమేథీతో తన బంధం చెక్కు చెదరదని రాహుల్ తెలిపారు. ఎప్పటికీ అమేథీ ప్రజల వెన్నంటే ఉంటానని చెప్పారు. తొలిసారి తాను అమేథీకి వచ్చినప్పుడు రోడ్లు కానీ, అభివృద్ధి కానీ లేవని తెలిపారు. ఈ లోక్ సభ ఎన్నికలు దేశానికి అత్యంత ముఖ్యమని చెప్పారు. ఒక జాతీయ పార్టీ (బీజేపీ) నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారని... రాజ్యాంగాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు.  

రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని రాహుల్ చెప్పారు. ప్రస్తుత రాజ్యాంగానికి ముగింపు పలకాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని... రాజ్యాంగం కనుమరుగైతే ప్రభుత్వ రంగమే ఉండదని అన్నారు. రిజర్వేషన్లకు స్వస్తి పలుకుతారని, ద్రవ్యోల్బణం తార స్థాయికి చేరుకుంటుందని చెప్పారు. ప్రజల హక్కులను ఒక్కొక్కటిగా లాక్కుంటారని తెలిపారు. 22 నుంచి 25 మంది శ్రీమంతుల కోసం రైతులు, కార్మికుల హక్కులను కాలరాస్తారని చెప్పారు. ఇప్పటి వరకు రైతులకు, ప్రజలకు మేలు జరిగినా... హరిత విప్లవాన్ని తీసుకొచ్చినా అది రాజ్యాంగంతోనే సాధ్యమయిందని అన్నారు.

Rahul Gandhi
Congress
Rajiv Gandhi
Amethi

More Telugu News