Usain Bolt: క్రికెట్‌ నా రక్తంలోనే ఉంది.. టీ20 ఫార్మాట్ అంటే పిచ్చి.. కోహ్లీ స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌: ఉసేన్ బోల్ట్

Usain Bolt says Cricket in my blood and Praises Virat Kohli
  • మ‌రో 15 రోజుల్లో టీ20 ప్ర‌పంచ‌కప్ 2024 ప్రారంభం
  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2024 బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న‌ ఉసేన్ బోల్ట్
  • క్రికెట్ గురించి ప‌లు ఆసక్తికర విషయాలను పంచుకున్న బోల్ట్

మ‌రో 15 రోజుల్లో టీ20 ప్ర‌పంచ‌కప్ ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్ప‌టికే స‌ర్వం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2024కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన ఎనిమిది ఒలింపిక్ గోల్డ్‌ మెడల్స్‌ విజేత, జ‌మైక‌న్ చిరుత‌ ఉసేన్ బోల్ట్ భారత స్టార్‌ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. అలాగే తన ఫేవరెట్ క్రికెట‌ర్లు ఎవ‌రో కూడా వెల్ల‌డించాడు. ఇంకా క్రికెట్ గురించి ప‌లు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

క్రికెట్‌ నా రక్తంలోనే ఉంది..
"మా నాన్న క్రికెట్‌కు వీరాభిమాని. జమైకాకి చెందిన నా రక్తంలోనే క్రికెట్‌ ఉంది. ఇప్పుడు క్రికెట్‌కు అంబాసిడర్‌గా ఉండటం అద్భుతంగా అనిపిస్తుంది. నాకు టీ20 ఫార్మాట్‌ అంటే పిచ్చి. ప్ర‌పంచ‌కప్‌ ద్వారా అమెరికాలో క్రికెట్‌ను ప్ర‌మోట్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది" అని బోల్ట్ చెప్పాడు.

క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌..
"ప్ర‌స్తుతం క్రికెట్‌లో చాలా మంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ అందరికంటే ప్రత్యేకం. అతడి గ్లోబల్‌ పాప్యులారిటీ, ఇన్‌ఫ్లూయెన్స్‌ ఎంతో గొప్పవి. ప్రత్యేకంగా కోహ్లీ కోసమే అభిమానులు స్టేడియంకు తరలి వస్తుంటారు. రాబోయే వ‌ర‌ల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు విండీస్‌, యూఎస్‌ఏలోని మైదానాలకు అభిమానులు భారీగా వస్తుంటే, అందుకు సగం కారణం విరాటే" అని బోల్ట్ తెలిపాడు.

నా అభిమాన‌ క్రికెటర్లు వీరే..
"చిన్న‌ప్పుడు పాకిస్థాన్ స్టార్ క్రికెట‌ర్‌ వసీం అక్రమ్, విండీస్ దిగ్గజాలు కోర్ట్నీ వాల్ష్, కర్ట్లీ ఆంబ్రోస్ వంటి ప్లేయర్‌లు అంటే ఇష్టం. ముఖ్యంగా వసీం అక్రమ్‌ వేసే ఇన్‌ స్వింగర్‌ యార్కర్‌కు అతని ఫ్యాన్‌గా మారిపోయాను. అలానే అప్పట్లో సచిన్ టెండూల్కర్‌, బ్రియాన్ లారా మధ్య ఉండే బ్యాటింగ్‌ పోటీని చాలా ఇష్టపడే వాడిని. మా నాన్న కారణంగా వెస్టిండీస్‌ మా టీమ్‌ కావడంతో నేను లారాకి సపోర్ట్‌ చేశాను. కానీ నాకు సచిన్‌ కూడా ఎంతో ఇష్టం." అని బోల్ట్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News