Chandrababu: ఏపీలో పోలీసులు ఫెయిల్... ఇప్పుడీ హింస విశాఖకు కూడా పాకింది: చంద్రబాబు

Chandrababu concerns violence in Visakha too
  • ఏపీలో మే 13న ముగిసిన పోలింగ్
  • ఇప్పటికీ కొనసాగుతున్న హింస
  • విశాఖలో దాడి ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు
  • వైసీపీ ఇచ్చిన డబ్బు నిరాకరించి టీడీపీకి ఓటేశారని నలుగురిపై దాడి చేశారని ఆగ్రహం

ఏపీలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడీ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరిందని తెలిపారు. 

"విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై దారుణంగా దాడి చేశారు. ఆడవాళ్లపై కూడా పాశవిక దాడికి పాల్పడ్డారు. వైసీపీ మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.

పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. వైసీపీ రౌడీ మూకలు ఇళ్లలో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి గూండాలను అరెస్ట్ చేయాలి. మాచర్లలో మారణహోమానికి కారణమైన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేస్తే తప్ప అక్కడ దాడులు ఆగే పరిస్థితి కనిపించడంలేదు. 

అలాగే, విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసు నిందితుడు, పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ నేత స్టేషన్ నుంచి పారిపోవడం పోలీసుల ఉదాసీన వైఖరికి నిదర్శనం. 

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల హింసలో నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి. తప్పు చేసిన పోలీసు అధికారులను బదిలీ చేయడమే కాకుండా, వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలి" అంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News