IMD: వాతావరణ శాఖ చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్!

IMD Pridicts that Southwest Monsoon Likely To Reach Kerala Around May 31
  • మే 31 నాటికి కేరళను తాకనున్నట్టు ప్రకటించిన భారత వాతావరణ విభాగం
  • ముందస్తు రాక కాదన్న ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర
  • సాధారణ తేదీకీ సమీపంగానే రుతుపవనాలు వస్తున్నాయని వెల్లడి

వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. మే నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని అంచనా వేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులు అటుఇటుగా మే 31న కేరళను తాకనున్నాయని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయని ఐఎండీ లెక్కగట్టింది. ఈ మేరకు బుధవారం అంచనాలను వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మే 1న కేరళను తాకడం ముందస్తు కాదని, సాధారణ తేదీకి సమీపంగా ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. కాగా వ్యవసాయాధారిత భారత ఆర్థిక వ్యవస్థకు నైరుతి రుతుపవనాలు చాలా ముఖ్యమైనవి. నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా నాలుగు నెలలపాటు వర్షాలు కురుస్తాయి. కాగా ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవనుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసిన విషయం తెలిసిందే.

కాగా ఐఎండీ డేటా ప్రకారం.. గత 150 ఏళ్లలో కేరళలో రుతుపవన వర్షాల ప్రారంభ తేదీలు మారుతూ వస్తున్నాయి. 1918లో చాలా త్వరగా మే 11నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఇక అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18న రాష్ట్రాన్ని రుతుపవనాలు తాకాయి. ఇక గతేడాది జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకినట్టుగా డేటా స్పష్టం చేస్తోంది.

కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రభావంతో పవర్ గ్రిడ్‌లు దెబ్బతింటున్నాయి. నీటి వనరులు ఎండిపోతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కరవు పరిస్థితులు కూడా ఏర్పడిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News