Natti Kumar: వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ వెళ్లడంపై నిర్మాత నట్టి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Producer Natti Kumar sensational comments on Allu Arjun
  • మెగా ఫ్యామిలీలో ఒక హీరో వెళ్లినంత మాత్రాన నష్టం లేదన్న నట్టి కుమార్
  • ఏపీలోని మంత్రులందరూ ఓడిపోతున్నారని వ్యాఖ్య
  • ఓటమి భయంతో వైసీపీ దాడులకు పాల్పడుతోందని విమర్శ
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం స్టార్ హీరో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మెగా హీరోలంతా జనసేనాని పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేస్తుంటే... బన్నీ మాత్రం వైసీపీ అభ్యర్థి కోసం వెళ్లడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ నేపథ్యంలో సినీ నిర్మాత నట్టి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

పవన్ కల్యాణ్ కు మెగా కుటుంబమంతా మద్దతుగా ఉందని... కుటుంబంలో ఒక సభ్యుడు సపోర్ట్ చేయనంత మాత్రాన పవన్ కు వచ్చే నష్టం ఏమీ లేదని నట్టి కుమార్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి మహా వృక్షమని... ఆయన కారణంగా మెగా హీరోలంతా ఎదిగారని... అల్లు అర్జున్ కూడా అంతేనని చెప్పారు. వైసీపీ అభ్యర్థి కోసం బన్నీ వెళ్లడం తనకు నచ్చలేదని... ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అన్నారు. దీనిపై బన్నీ కూడా ఆలోచించాలని... బన్నీ వెళ్లిన ఫొటోలు, వీడియోలను వైసీపీ తనకు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుందని చెప్పారు. 

ఈ ఎన్నికల్లో వైసీపీ మంత్రులందరూ ఓటమిని చవిచూడబోతున్నారని నట్టి కుమార్ జోస్యం చెప్పారు. ఉత్తరాంధ్రలో కూటమి ఘన విజయం సాధించబోతోందని... గ్రౌండ్ రిపోర్ట్ తెలిసిన వ్యక్తిగా ఈ విషయాన్ని తాను చెపుతున్నానని అన్నారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని... కొందరు అధికారులు వైసీపీకి తొత్తులుగా మారి అల్లర్లకు సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. 

జన్మభూమి మీద మమకారంతో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేశారని... గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని నట్టి కుమార్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కూటమి విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
Natti Kumar
Allu Arjun
Tollywood
Pawan Kalyan
Janasena
YSRCP

More Telugu News