G. Kishan Reddy: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మాపై అబద్ధాలు ప్రచారం చేశారు: కిషన్ రెడ్డి

Kishan Reddy fires at Revanth reddy
  • లోక్ సభ ఎన్నికలు రెఫరెండమన్నారు... ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారని ప్రశ్న
  • ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖతమవుతుందని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ వాళ్లు కూడా నమ్మలేదన్న కిషన్ రెడ్డి
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శ

రిజర్వేషన్ల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు తమపై అబద్ధాలు ప్రచారం చేశారని... అయినప్పటికీ ప్రజలు తమను విశ్వసించారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికలు రెఫరెండమని రేవంత్ రెడ్డి అన్నారని... ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. 

తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయన్నారు. డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మకపోవడం వల్ల చాలామంది కాంగ్రెస్ వాళ్లు కూడా బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారన్నారు. మజ్లిస్ పార్టీ వ్యవహరించిన తీరు కూడా బీజేపీకి అనుకూలంగా మారిందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరించిందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని మాత్రమే చేశారన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చిందని... వీటిపై తాము ప్రజల తరఫున పోరాడుతామని... ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికైనా నీచ రాజకీయాలకు దిగజారకుండా ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించడం లేదని విమర్శించారు. పెళ్లి చేసుకుంటే అమ్మాయికి తులం బంగారం ఇస్తామని చెప్పారని... ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయలేదన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదన్నారు. రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకొని తిరిగారని... కానీ ప్రజలు మాత్రం నమ్మలేదన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు బదులు గాడిద గుడ్డు అయిందేమోనని ప్రజలు భావించారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News