AP Assembly Polls: హింసాత్మక ఘటనలు చెలరేగడంతో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్‌ విధింపు

Section 144 imposed in Palnadu district due to violent incidents
  • మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి అమల్లోకి ఆంక్షలు
  • తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగింపు
  • పోలింగ్ మర్నాడు కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో రంగంలోకి ఈసీ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడు కూడా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసు శాఖకు జిల్లా కలెక్టర్ శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ముగ్గురు వ్యక్తులకు మించి ఎక్కువ మంది గుమికూడడానికి వీల్లేదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. అనుమానాస్పదంగా సంచరించడానికి కూడా వీల్లేదని అధికారులు పేర్కొన్నారు. 

కాగా ఏపీ అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక ఘటనలు మరుసటి రోజైన మంగళవారం కూడా కొనసాగాయి. దీంతో 144 సెక్షన్‌ విధింపునకు ఈసీ నిర్ణయం తీసుకుంది. నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ సెక్షన్ అమల్లో ఉంటుంది.

  • Loading...

More Telugu News