Allu Arjun: నంద్యాల ప‌ర్య‌ట‌న‌పై అల్లు అర్జున్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న‌ తర్వాత మీడియాతో మాట్లాడిన ‌అల్లు అర్జున్  
  • త‌న‌కు ఏ పార్టీతో సంబంధం లేద‌ని.. నా అనుకునే వాళ్లకు తప్పకుండా సపోర్ట్ చేస్తానన్న బ‌న్నీ
  • రవిచంద్ర రాజ‌కీయాల్లోకి వస్తే తప్పకుండా ఊరు వచ్చి సపోర్ట్ చేస్తానని మాటిచ్చాన‌న్న ‌బన్నీ 
  • అందుకే భార్య స్నేహ‌తో క‌లిసి నంద్యాల వెళ్లి విషెస్ చెప్పిన‌ట్లు స్ప‌ష్టీక‌ర‌ణ‌
Allu Arjun Explanation on Nandyal Tour

రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కొన‌సాగుతోంది. దీంతో సాధార‌ణ జ‌నంతో క‌లిసి వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు కూడా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్ ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన‌ తర్వాత మీడియాతో మాట్లాడిన ఐకాన్‌ స్టార్ త‌న నంద్యాల ప‌ర్య‌ట‌న విష‌య‌మై కీల‌క వ్యాఖ్యలు చేశారు.

తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, నా అనుకునే వాళ్లకు తప్పకుండా సపోర్ట్ చేస్తానని బ‌న్నీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి వ్యక్తిగతంగా మద్దతు ఇస్తానని తెలిపారు. "మా అంకుల్ పవన్ కల్యాణ్ అయినా, నా ఫ్రెండ్ రవిచంద్ర లేదా మా మావయ్య చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు. అంతేందుకు మా బన్నీ వాసు అయినా కూడా సపోర్ట్ చేస్తా. వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్‌రెడ్డి 15 ఏళ్లుగా నాకు ఫ్రెండ్. ఆయ‌న‌ రాజ‌కీయాల‌లోకి వస్తే తప్పకుండా మీ ఊరు వచ్చి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చాను. కానీ, 2019లో ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక వెళ్లి క‌ల‌వ‌లేక‌పోయాను. ఇచ్చిన మాట నిల‌బెట్టుకునేందుకు ఒక్క‌సారైనా క‌న‌ప‌డాల‌ని నా మ‌న‌సులో ఉంది. అందుకే నా భార్య స్నేహ‌తో కలిసి వెళ్లి రవికి విషెస్ చెప్పాను" అని అల్లు అర్జున్ వివ‌రించారు.  

 శనివారం నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్..
శనివారం అల్లు అర్జున్ నంద్యాలలోని వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడారు. అనుమ‌తి లేకుండా జ‌న స‌మీక‌ర‌ణ‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌ల‌పై అల్లు అర్జున్‌పై నంద్యాల జిల్లాలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు చేశామ‌ని ఎన్నిక‌ల అధికారి జేసీ రాహుల్ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు. ఎన్నికల ప్రచారం కోసం వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్‌రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ చేరుకున్నారని, దీంతో అక్కడ జనాలు గుమికూడారని పోలీసులు తెలిపారు. అందుకే ప‌ట్ట‌ణంలో 30 పోలీసు యాక్టు, 114 సెక్ష‌న్ అమ‌ల్లో ఉండ‌గా ఎన్నిక‌ల అధికారి అనుమ‌తి లేకుండా చంద్ర‌కిశోర్ రెడ్డి ఇంటికి బ‌న్నీ వ‌చ్చార‌ని, అక్క‌డ భారీ సంఖ్య‌లో జ‌నాలు గుమిగూడార‌ని అన్నారు.

  • Loading...

More Telugu News