Royal Challengers Bangaluru: ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై సంచలన విజయం

Royal Challengers Bengaluru Records fifth win in a row against Delhi Capitals
  • వరుసగా ఐదవ విజయాన్ని నమోదు చేసిన డుప్లెసిస్ సేన
  • 188 టార్గెట్‌ను ఛేదించలేక 140 పరుగులకే ఆలౌట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్
  • 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలను సజీవంగా ఉంచుకుంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు ఛేదించలేకపోయారు. యశ్ దయాల్, లూకీ ఫెర్గూసన్‌తో పాటు ఇతర బెంగళూరు బౌలర్లు రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ పటేల్ (57) మినహా ఎవరూ పెద్ద రాణించలేకపోయారు. షాయ్ హోప్ (29), జేక్ ఫ్రేజర్ (21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు.

కీలకమైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా పేసర్ యశ్ దయాల్ 3 వికెట్లతో చెలరేగాడు. మిగతా వారిలో లూకీ ఫెర్గూసన్ 2, గ్రీన్, మహ్మద్ సిరాజ్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ తీశారు. మరో రెండు వికెట్లు రనౌట్ రూపంలో లభించాయి. అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. బ్యాటర్లు అందరూ సమష్టిగా రాణించారు. 54 పరుగులతో రజత్ పటీదార్ టాప్ స్కోరర్‌గా నిలవగా విల్ జాక్స్ (41), కోహ్లీ (27), డుప్లెసిస్ (6), గ్రీన్ (32 నాటౌట్), లామ్రోర్ (13), దినేక్ కార్తీక్ (0), స్వప్నిల్ సింగ్ (0), కర్ణ్ శర్మ (6), సిరాజ్(0 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. బ్యాటింగ్ బౌలింగ్‌లో ఆకట్టుకున్న కెమెరాన్‌ గ్రీన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

కాగా ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఫ్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. ప్రస్తుతం 12 విజయాలు, మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. మిగిలివున్న మ్యాచ్‌లో గెలుపుతో పాటు ఇతర జట్ల ఫలితాలు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలను నిర్దేశించనున్నాయి.
Royal Challengers Bangaluru
Delhi Capitals
IPL 2024
Cricket

More Telugu News