CM Kejriwal: జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుదీరుతుంది: కేజ్రీవాల్

  • ఇండియా కూటమి వస్తే ఢిల్లీకి రాష్ట్ర స్థాయి హోదా వస్తుందన్న ఆప్ అధినేత
  • జూన్ 4న బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందన్న ఢిల్లీ సీఎం
  • నియంతృత్వంపై పోరాటంలో మద్దతివ్వాలని ఢిల్లీ ప్రజలకు అభ్యర్థన
  • ఢిల్లీలో నిర్వహించిన భారీ రోడ్‌షోలో ప్రసంగించిన కేజ్రీవాల్
CM Kejriwal asserted that the Modi government will not be formed on June 4

ఇండియా కూటమి జూన్ 4న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆయన అన్నారు. శనివారం రాత్రి ఢిల్లీలో జరిగిన రోడ్‌షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, ఆ తర్వాత ఢిల్లీకి రాష్ట్ర హోదా అందజేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

జూన్ 4న మోదీ ప్రభుత్వం ఏర్పాటుకాబోదని అని అన్నారు. ‘‘జైలు నుంచి విడుదలయ్యాక నేరుగా మీ వద్దకే వచ్చాను. ఢిల్లీ ప్రజలను చాలా మిస్ అయ్యాను. నా కోసం ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలు అందించిన కోట్లాది మందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది. నియంతృత్వానికి వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతుంది’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

‘‘ ఓటర్లు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలి. ఈ కూటమి దేశం దిశను మార్చుతుంది. దేశం ఎందరో నియంతలను చూసింది. వారి నియంతృత్వం కొనసాగలేదు. ప్రజలు వారిని పడగొట్టారు. నేడు నేను నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ఈ పోరాటంలో మీ మద్దతు కోరేందుకు వచ్చాను’’ అని అన్నారు. తీహార్ జైలులో ఉన్న తన కేబినెట్ మాజీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లను కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు. వారు పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చారని పేర్కొన్నారు.

కాగా తీహార్ జైలు నుంచి శుక్రవారం విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతంగా కొనసాగిస్తున్నారు. శనివారం ఆయన చేపట్టిన మొదటి రోడ్‌షోకు పెద్ద సంఖ్యలో ఆప్ మద్దతుదారులు హాజరయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి ఓపెన్ రూఫ్ వాహనంపై కూర్చొని కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు. దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ర్యాలీని కొనసాగించారు.

  • Loading...

More Telugu News