Crime News: నిశ్చితార్థం రద్దు.. బాలిక తల నరికి ఉరేసుకున్న వరుడు

Groom Killed Girl And Committed Suicide In Karnataka
  • కర్ణాటకలోని కొడుగు జిల్లాలో ఘటన
  • నిశ్చితార్థం ఇష్టంలేకపోవడంతో తెలిసిన వారి ద్వారా అధికారులకు బాలిక సమాచారం
  • అడ్డుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు
  • బాలికే ఇచ్చిందని అనుమానించిన వరుడు
  • అడవిలోకి తీసుకెళ్లి హత్యచేసి ఆపై ఉరేసుకున్న హంతకుడు
నిశ్చితార్థం చేసుకుంటున్న అమ్మాయి మైనర్ కావడంతో రంగంలోకి దిగిన అధికారులు అడ్డుకున్నారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన వరుడు ఆమెను నరికి చంపాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. కొడుగు జిల్లాలోని సూర్లబ్బి గ్రామానికి చెందిన మీనా (16)తో స్థానికుడైన ప్రకాశ్ (32)కు వివాహం చేయాలని ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయించారు. గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, బాలికకు ఈ పెళ్లి ఇష్టం లేదు. 

తనకు పరిచయం ఉన్నవారి ద్వారా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులకు సమాచారం అందించింది. వెంటనే బాలిక ఇంటికి చేరుకున్న అధికారులు నిశ్చితార్థాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహం నేరమని ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

నిశ్చితార్థం అడ్డుకోవాలని మీనానే అధికారులకు సమాచారం ఇచ్చిందని అనుమానించిన ప్రకాశ్.. ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె ఇంటికి వెళ్లి మీనా తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఆపై మీనాను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి తల నరికి హత్య చేశాడు. మొండాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను హత్యచేసిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రకాశ్ కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Crime News
Karnataka
Kodugu
National News

More Telugu News