YS Sharmila: మనిద్దరం నమ్మే బైబిల్ పై ఒట్టేద్దాం... ఆ విషయం నిరూపించగలరా?: సీఎం జగన్ కు షర్మిల సవాల్

Sharmila cries during press meet about her brother Jagan comments
  • నా రాజకీయ కాంక్ష వల్లే గొడవలు వచ్చాయని జగన్ అన్నారని షర్మిల వెల్లడి
  • నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరంటూ ప్రశ్నించిన షర్మిల
  • మీరు సీఎం అయ్యేవరకు నాకు రాజకీయ కాంక్ష లేదా? అంటూ ప్రశ్న
  • మీరు సీఎం అయ్యాక నాకు రాజకీయ కాంక్ష కలిగిందా? అంటూ నిలదీత  
కడప లోక్ సభ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు కడపలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకు బదులిచ్చే ప్రయత్నం చేశారు. 

"నా రాజకీయ కాంక్ష వల్లే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలు వచ్చినట్టు జగన్ వ్యాఖ్యానించారు. నా రాజకీయ కోరికను ప్రోత్సహిస్తే అది బంధుప్రీతికి దారితీస్తుందని... కుటుంబంలో కలతలకు ఇదే కారణమని చెప్పారు. ఇప్పుడు చెల్లెలిగా జగన్ మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ఎవరు? 

జగన్ అరెస్ట్ అయితే 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలని నన్ను అడిగింది మీరు కాదా? మీరు జైలుకు వెళ్లినప్పుడు... ఓవైపు చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు, ఆయనకు గ్రాఫ్ పెరుగుతుంది... అందుకే నన్ను కూడా పాదయాత్ర చేయాలని చెప్పింది మీరు కాదా? 

సమైక్యాంధ్ర కోసం, తెలంగాణలో ఓదార్పు యాత్ర, బై బై బాబు ప్రచారం కోసం ఉపయోగపడింది నేను కాదా? మీ అవసరాల కోసం మీరు నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది వాస్తవం కాదా? 

నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరు జైల్లో ఉన్నారు... ఆ సమయంలో పార్టీ అంతా నా చుట్టూనే తిరుగుతోంది. నాకు రాజకీయ కాంక్షే ఉంటే... వైసీపీని నేను హస్తగతం చేసుకుని ఉండేదాన్ని కాదా? కానీ, జగనన్నే వస్తాడు, జగనన్న రాజ్యం వస్తుంది, రాజశేఖర్ రెడ్డిని మరిపించేలా పరిపాలిస్తాడు అని కాలికి బలపం కట్టుకుని తిరిగింది నేను కాదా?

నా పిల్లలను కూడా పట్టించుకోకుండా రోడ్ల వెంబడి నెలల తరబడి తిరిగిన దాన్ని నేను కాదా? కాలికి దెబ్బ తగిలినా, వెంటనే ఫిజియో థెరపీ చేయించుకుని మీ కోసం మళ్లీ పాదయాత్రకు సిద్ధమైంది నేను కాదా? నేను ఇన్ని త్యాగాలు చేసినా నాకు రాజకీయ కాంక్ష ఉందని మీరు విమర్శిస్తున్నారు. 

నాకే గనుక రాజకీయ కాంక్ష ఉంటే మీ పార్టీలోనే ఉంటూ నేను పొందాలనుకున్న పదవిని మొండిగా పొందగలను. నన్ను ఎంపీగా చేయాలని వివేకా వంటి వారు ఎంతోమంది మీ పార్టీ వాళ్లే కోరుకున్నారు. వాళ్ల అండ చూసుకుని ఎప్పుడైనా ధిక్కరించానా? మీరు ముఖ్యమంత్రి అయ్యేంత వరకేమో నాకు రాజకీయ కాంక్ష, డబ్బు కాంక్ష లేనట్టా, ఏం చేసినా మీ కోసం చేసినట్టా... ఇప్పుడు నాకు రాజకీయ కాంక్ష, డబ్బు కాంక్ష ఉన్నట్టా? 

మనిద్దరం నమ్మే బైబిల్ మీద ఒట్టేద్దాం... నాకు రాజకీయ కాంక్ష కానీ, డబ్బు కాంక్ష కానీ లేవని, మీ నుంచి నేను ఒక్క పదవి కూడా ఆశించకుండా మీకోసం చేశానని నేను చెప్పగలను. మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి... నేనేదైనా పదవి అడిగానని మీరు చెప్పగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉందని కానీ, డబ్బు కాంక్ష ఉందని కానీ మీరు రుజువు చేయగలరా? 

మనిషిని, మనిషి మంచితనాన్ని గుర్తించడం మీకు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఎందుకు రాలేదు? రాజశేఖర్ రెడ్డి  ఏనాడూ స్వలాభం కోసం ఆలోచించలేదు. ఆయన హృదయంలో హృదయంలా పెరిగిన దాన్ని నేను. నమ్మిన ఆశయాల కోసం ఏవిధంగా అయితే  త్యాగం చేసే మనసు ఆయనకు ఉందో, అదే విధంగా నిస్వార్థంగా మీ కోసం నేను త్యాగం చేశాను" అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
YS Sharmila
Jagan
Politics
Family
Congress
YSRCP

More Telugu News