AP High Court: ‘సంక్షేమ’ నిధుల పంపిణీకి ఏపీ ప్రభుత్వానికి ఒక్క రోజు వెసులుబాటు!

  • ఎన్నికల వరకూ నిధులు పంపిణీ చేయొద్దన్న ఈసీ ఉత్తర్వులపై హైకోర్టు నేటి వరకూ స్టే
  • నిధుల పంపిణీకి ఎటువంటి ప్రచారం కల్పించొద్దని ఆదేశాలు
  • ఈ నెల 11 నుంచి 13 వరకూ ఎటువంటి నిధులు విడుదల చేయొద్దన్న న్యాయస్థానం
AP High stay on welfare schemes funds release from 11 to 13 of april

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్‌పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకూ లబ్ధిదారులకు విడుదల చేయొద్దని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిధుల విడుదలపై ఈసీ గతంలో ఇచ్చిన స్టేను ఈ నెల 10 వరకూ తాత్కాలికంగా పక్కనపెట్టింది. దీంతో, శుక్రవారం అర్ధరాత్రి వరకూ నిధుల పంపిణీకి ఏపీ ప్రభుత్వానికి అవకాశం చిక్కినట్టైంది. అయితే, నిధుల పంపిణీని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని, ఈసీ ప్రవర్తన నియమావళికి లోబడి నిధుల పంపిణీ ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఈ నెల 13న పోలింగ్ ముగిసే వరకూ సంక్షేమ పథకాల నిధుల సొమ్ము రూ.14,165 కోట్ల పంపిణీని నిలిపివేస్తూ ఈసీ ఈ నెల 9న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. 

ఈసీ తరుపు లాయర్ అవినాశ్ దేశాయ్ వాదిస్తూ వివిధ పథకాల కింద లబ్ధిదారులకు రూ.14,165 కోట్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరిందన్నారు. ఎన్నికలకు ముందు అంతపెద్ద మొత్తంలో సొమ్మును జమ చేస్తే ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాన అవకాశాలు దెబ్బతినకుండా, లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సొమ్మును జమ చేసే విషయంలో రెండు మూడు రోజులు వేచి చూస్తే వచ్చే నష్టమేమీ లేదన్నారు.

కరవు మండలాలు, బాధిత రైతులను ప్రభుత్వం ఆరు నెలల కిందట గుర్తించిందని, ఇప్పటివరకూ సొమ్ము జమ చేయకుండా పోలింగ్ తేదీకి రెండు మూడు రోజుల ముందు సొమ్ము జమచేస్తే ఎన్నికలను ప్రభావితం చేసినట్టు అవుతుందని తెలిపారు. ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేయలేదని, లబ్ధిదారులే పిటిషన్లు వేశారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, కొత్త పథకాలతో పాటు అమలులో ఉన్న పథకాలకూ వర్తిస్తుందని చెప్పారు. 

పథకాలకు నిధుల విడుదల చేస్తున్నట్టు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఈసీ ప్రస్తావించింది. అయితే, సొమ్మ జమచేయడంలో ఇంత జాప్యం ఎందుకు జరిగిందో తెలియజేస్తూ ప్రభుత్వం సమర్పించిన వినతిలో పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవని ఈసీ తరపు లాయర్ పేర్కొన్నారు. పెట్టుబడి రాయితీ విషయంలో ఆరు నెలలు వేచి చూసిన వారు మరో మూడు, నాలుగు రోజులు వేచి చూడలేరా అని అన్నారు. ఒకటి రెండు రోజుల వ్యవధిలో వేల కోట్లు జమ చేస్తే ఎన్నికలపై ప్రభావం పడుతుందని అన్నారు. 

మరోవైపు లబ్ధిదారులు తమ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే అమలవుతున్న పథకాల నిధులను నిలుపుదల చేయాల్సిన అవసరం లేదని ఈసీ నియమావళి స్పష్టం చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల కోడ్ పాత పథకాలకు వర్తించదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. నిధుల లభ్యతను బట్టి సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. నిధుల పంపిణీకి అనుమతి కోరుతూ స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనకు సకాలంలో నిర్ణయం వెల్లడించకుండా ఈసీ జాప్యం చేసిందన్నారు. నిధుల జమకు అనుమతివ్వాలని కోరారు.

  • Loading...

More Telugu News