Nara Bhuvaneswari: మంగళగిరిలో లోకేశ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari  appeals please vote for Nara Lokesh in Mangalagiri
  • మంగళగిరి నియోజకవర్గం కురగల్లులో రచ్చబండ
  • లోకేశ్ తో కలిసి హాజరైన నారా భువనేశ్వరి
  • వైసీపీ ప్రభుత్వానికి ఈ నెల 13న ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు
మంగళగిరి నియోజకవర్గం కురగల్లులో నిర్వహించిన టీడీపీ రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎవరూ భయపడుతూ బతకకూడదు... గత ఐదేళ్లుగా వేధించిన వైసీపీ రాక్షస ప్రభుత్వానికి ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

"టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును 53 రోజులు జైలులో పెట్టినపుడు మహిళలంతా నాకు అండగా నిలిచారు. వారి స్ఫూర్తితోనే రాష్ట్రవ్యాప్తంగా 'నిజం గెలవాలి' కార్యక్రమాన్ని నిర్వహించాను. ఈ అరాచక ప్రభుత్వం ప్రజలను ఎన్నో కష్టాలకు గురిచేసింది. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఓటుతోనే వస్తాయి, అందరూ కలిసి రాబోయే ఎన్నికల్లో అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి.

గత ఐదేళ్లలో ఎంతోమంది కార్యకర్తలు తమ జీవితాన్ని త్యాగం చేశారు, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు, కొందరు నాయకులు వెళ్లిపోయినా కేడర్ వెన్నంటి మమ్మల్ని ముందుకు నడిపించారు, వారి కష్టాన్ని మర్చిపోం, వారందరినీ కన్నబిడ్డల్లా చూసుకునే బాధ్యత నాది. 

ముఖ్యమంత్రి అంటే కేవలం బటన్ నొక్కడమే కాదు, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలి. రాష్ట్రవిభజన తర్వాత ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమించారు. ఇప్పటి పరిస్థితుల్లో కుటుంబానికి తండ్రిలా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడు కావాలి. మీ ఓటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. 

రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేస్తున్న లోకేశ్ ను స్థానిక ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా" అంటూ నారా భువనేశ్వరి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Nara Bhuvaneswari
Nara Lokesh
Mangalagiri
TDP
Chandrababu
TDP-JanaSena-BJP Alliance

More Telugu News