Yuvraj Singh: కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్.. మ‌రో వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ట్రోఫీకి అర్హుడు: యువరాజ్

Yuvraj Singh Heaps Praise On Virat Kohli Ahead Of T20 World Cup 2024
  • ఈ జ‌న‌రేష‌న్‌లో అన్ని ఫార్మాట్ల‌లో కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్ అంటూ ప్ర‌శంస‌ 
  • కోహ్లీ గొప్ప‌ ఛేజింగ్ మాస్ట‌ర్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదన్న యువీ
  • 6వ టీ20 ప్రపంచకప్ ఆడబోతున్న ర‌న్ మెషీన్ మ‌రో వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలుస్తాడ‌ని జోస్యం
టీ20 ప్రపంచకప్ 2024కి ముందు విరాట్ కోహ్లీపై భార‌త మాజీ క్రికెట‌ర్‌ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. విరాట్‌ను ఈ తరంలోనే అత్యుత్తమ బ్యాటర్ అని పేర్కొన్నాడు. గత వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఎడిషన్‌లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన కోహ్లీ.. మ‌రో టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడానికి అన్ని విధాల‌ అర్హుడని తెలిపాడు. కాగా, విరాట్‌ ఈ ఏడాది 6వ టీ20 ప్రపంచకప్‌ ఆడనున్నాడు. 2012లో టీ20 ప్రపంచ కప్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి టోర్నమెంట్ చరిత్రలో (1,141 ప‌రుగులు) అత్యధిక ర‌న్స్‌ స్కోరర్‌గా కొన‌సాగుతున్నాడు.

కోహ్లీపై యువ‌రాజ్ ప్రశంసల జ‌ల్లు..!
ఐసీసీ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన యువీ.. ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. విరాట్ ప‌రుగుల దాహం తీరేది కాదు. 35 ఏళ్ల అత‌డు మ‌రో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచే వ‌ర‌కు ఆగ‌డు. సంద‌ర్భాన్ని బ‌ట్టి త‌న బ్యాటింగ్ శైలిని మార్చుకునే కోహ్లీ అద్భుత‌మైన ఛేజింగ్ మాస్ట‌ర్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లపై ఎల్లప్పుడూ తన వీరోచిత‌మైన ఛేజింగ్ ఇన్నింగ్స్‌తో అద‌ర‌గొట్ట‌డం అత‌ని స్టైల్ అని యువ‌రాజ్ చెప్పుకొచ్చాడు. 

ఇంకా యువీ మాట్లాడుతూ.. "ఈ జ‌న‌రేష‌న్‌లో అన్ని ఫార్మాట్ల‌లో కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్. అత‌ను అన్ని రికార్డుల‌ను బ్రేక్ చేశాడు. ర‌న్ మెషీన్ ఖాతాలో ఓ వ‌రల్డ్ క‌ప్ ఉంది. క‌చ్చితంగా అత‌ను దానితో సంతృప్తి చెంద‌డు. మ‌రో ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీకి ఛేజింగ్ మాస్ట‌ర్ వంద‌కు వంద‌శాతం అర్హుడు. అతను తన ఆటను బాగా అర్థం చేసుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో అత‌నికి బాగా తెలుసు. ఏ బౌలర్లపై దాడి చేయాలి, ఏ బౌలర్లపై  సింగిల్స్ తీయాలి, ఒత్తిడిని ఎదుర్కొనేందుకు త‌న‌ ఆటను ఎప్పుడు మార్చాలో బాగా తెలుసు. అత‌ను చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉంటే భార‌త్‌కు విజ‌యం ద‌క్కుతుంది. అందుకే విరాట్ గొప్ప ఛేజింగ్ మాస్ట‌ర్ అని నేను భావిస్తున్నా" అని యువీ పేర్కొన్నాడు.
Yuvraj Singh
Virat Kohli
T20 World Cup 2024
Team India
Cricket
Sports News

More Telugu News