IPL 2024: సంజూ శాంసన్ పోరాడినా ఢిల్లీ క్యాపిటల్స్‌నే వరించిన విజయం

Despite Sanju Samsons fight Delhi Capitals won match
  • 20 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
  • ఐపీఎల్ 2024లో వరుసగా రెండవ పరాజయాన్ని చవిచూసిన రాజస్థాన్ రాయల్స్
  • 86 పరుగులతో రాణించిన సంజూ శాంసన్.. అయినా తప్పని ఓటమి
  • కీలక సమయాల్లో వికెట్లు తీసి గెలుపునకు బాటలు వేసిన ఢిల్లీ బౌలర్లు

కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఢిల్లీ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో గెలిచింది. 222 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. సంజూ శాంసన్ 46 బంతుల్లో 86 పరుగులు బాదినప్పటికీ మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రియాన్ పరాగ్ (27), శుభమ్ దూబే (25) కాస్త పరవాలేదనిపించినా జట్టుని విజయ తీరాలకు చేర్చలేకపోయారు. మిగతా బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), జాస్ బట్లర్ (19), పావెల్ (13), ఫెర్రీరా (1), రవిచంద్రన్ అశ్విన్ (2), ట్రెంట్ బౌల్ట్ (2 నాటౌట్), అవేశ్ ఖాన్ (7 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

ఇక ఢిల్లీ బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి మెరిశాడు. కీలకమైన దశలో రెండు ముఖ్యమైన వికెట్లు తీసి మ్యాచ్‌ని మలుపుతిప్పాడు. దీంతో అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్ దక్కింది. మిగతా బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ చెరో 2 వికెట్లు, అక్షర్ పటేల్, రశిక్ దార్ సలామ్ చెరో వికెట్ తీశారు.

ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ఫ్రేజర్ (50), అభిషేక్ పోరెల్ (65) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరిలో స్టబ్స్ 20 బంతుల్లో 41 పరుగులు బాదడం భారీ స్కోరు సాధించడంలో దోహదపడింది. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు, చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ తీశారు.

కాగా ఇటీవలే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 1 పరుగు తేడాతో రాజస్థాన్ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ ఆ జట్టు ఖాతాలో ఇప్పటికే 8 విజయాలు ఉండడంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.  ఇక 12 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా నాకౌట్‌ చేరుకోవాలనే తాపత్రయంతో కనిపిస్తోంది.
IPL 2024
Rajasthan Royals
Delhi Capitals
Cricket
samju samson

More Telugu News