MS Dhoni: ధోనీ నెం.9లో బ్యాటింగ్‌కి రావ‌డం వెనుక అస‌లు కార‌ణం ఇదే..!

  • ఈ ఐపీఎల్‌లో మొదటి నుంచి తొడ కండరాల గాయంతోనే ఆడుతున్న ధోనీ
  • అందుకే అతడు ఎక్కువ సేపు పరిగెత్తలేకే చివ‌ర్లో వస్తున్నాడని సీఎస్‌కే వెల్ల‌డి
  • జట్టులో రెండో వికెట్‌ కీపర్‌ డేవిడ్‌ కాన్వే కూడా గాయపడటం వల్ల తప్పనిసరి స్థితిలో మహీనే బరిలోకి దిగాల్సి వ‌స్తుందంటూ వ్యాఖ్య‌
Reason behind MS Dhoni decision to bat down the order revealed

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్లో చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ సార‌ధి మహేంద్ర సింగ్‌ ధోనీ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తున్న విష‌యం తెలిసిందే. ఇక గ‌త మ్యాచులోనైతే ఏకంగా నెం.9 స్థానంలో కూడా బ్యాటింగ్ చేశాడు. దీంతో అభిమానులు నిరాశకు గురౌతున్నారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ధోనీ వీలైనంత వెనక్కి జరుగుతున్నాడంటూ విమర్శలు చేస్తున్నారు. మాజీలు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. ఎంఎస్‌డీ బ్యాటింగ్‌లో ముందుకు రాలేకపోతే అతడిని తొలగించి ఓ అదనపు బౌలర్‌ను ఆడించాల్సిందని భార‌త‌ మాజీ ఆట‌గాడు హర్భజన్‌ సింగ్‌ పేర్కొన్నాడు.

అయితే తాజాగా ఎంఎస్ ధోనీ చివర్లో బ్యాటింగ్ కు ఎందుకు వస్తున్నాడో తెలిసింది. తప్పనిసరి పరిస్థితిలోనే ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనక్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఐపీఎల్‌లో మొదటి నుంచి అతడు తొడ కండరాల గాయంతోనే ఆడుతున్నాడట. అందుకే అతడు ఎక్కువ సేపు పరిగెత్తలేకే చివ‌ర్లో వస్తున్నాడని చెన్నై ఫ్రాంచైజీ వర్గాలు వెల్ల‌డించాయి.

వాస్తవానికి ఈ ఐపీఎల్‌ మొదలవ్వక ముందు నుంచే ధోనీ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. కానీ టీమ్ లో రెండో వికెట్‌ కీపర్‌ డేవిడ్‌ కాన్వే కూడా గాయపడటం వల్ల తప్పనిసరి స్థితిలో మహీనే బరిలోకి దిగాల్సి వచ్చిందట. అందుకే ఓవైపు మందులు వాడుతూనే వీలైనంత తక్కువ పరిగెత్తేలా కెప్టెన్ కూల్‌ జాగ్రత్తలు తీసుకుంటూ ఆడుతున్నాడని తెలిసింది. "మేం మా బీ టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నాం. మహీని విమర్శించే వారికి అతడు జట్టు కోసం చేస్తున్న త్యాగం గురించి తెలీదు" అని సీఎస్‌కే వర్గాలు తెలిపాయి.

ధోనీపై హర్భజన్ విమ‌ర్శ‌..!
ఇక పంజాబ్ కింగ్స్‌తో చెన్నై మ్యాచ్ సమయంలో భార‌త మాజీ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్‌.. ధోనితో పాటు సీఎస్‌కే థింక్ ట్యాంక్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ధోనీ ఆడకూడదని, అత‌ని బదులుగా మ‌రో పేసర్‌కి అవ‌కాశం ఇస్తే బాగుంటుంద‌ని మాజీ ఆఫ్ స్పిన్నర్ పేర్కొన్నాడు. 

"ఎంఎస్ ధోని 9వ స్లాట్‌లో బ్యాటింగ్ చేయాలనుకుంటే ఆడకూడదు. అతని కంటే ఫాస్ట్ బౌలర్‌ను ప్లేయింగ్-11లో చేర్చుకోవడం మంచిది. ధోనీ త‌న నిర్ణ‌యంతో తన జట్టును తీవ్రంగా నిరాశపరిచాడు. ముందుకు వ‌చ్చి బ్యాటింగ్ చేయండి. సీఎస్‌కే వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ధోనీ మునుపటి మ్యాచుల‌లో ఆ పని చేశాడు. కానీ, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ముఖ్యమైన పోటీలో అతను ఇలా వెనుదిరగడం షాకింగ్‌గా ఉంది. ఈరోజు చెన్నై గెలిచినా, నేను ధోనీ నిర్ణ‌యాన్ని విమ‌ర్శించ‌కుండా ఉండ‌లేను. అభిమానులు ఏదైనా చెప్పనివ్వండి. ఏది సరైనదో అదే నేను చెబుతాను" అని స్టార్ స్పోర్ట్స్‌లో హర్భజన్ అన్నాడు.

  • Loading...

More Telugu News