Revanth Reddy: అధికారం పోయింది... కూతురు జైలుకెళ్లింది... కేసీఆర్‌ను చూస్తే జాలేస్తోంది: రేవంత్ రెడ్డి

  • కూతురు బెయిల్ కోసం బీజేపీని 5 సీట్లలో గెలిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శ
  • తెలంగాణలో తాము జవాబుదారీతనం తెచ్చామన్న రేవంత్ రెడ్డి
  • కరవు అనే పాపం కేసీఆర్ నుంచి వారసత్వంగా వచ్చిందని వ్యాఖ్య
  • దుబారా తగ్గించుకుంటే మిగులు నిధులు ఉంటాయన్న రేవంత్ రెడ్డి
  • ఆర్ ట్యాక్స్ అని కేటీఆర్ ప్రారంభిస్తే ఆ తర్వాత బీజేపీ ఎత్తుకుందన్న సీఎం
Revanth Reddy blames kcr in question hour

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పక్కా చవకబారు రాజకీయ నాయకుడన్నారు. కేసీఆర్‌కు అధికారం పోయిందని... కూతురు జైలుకెళ్లిందని... ఆయనను చూస్తే జాలేస్తోందన్నారు. కూతురు బెయిల్ కోసం బీజేపీని 5 సీట్లలో గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీవీ 'క్వశ్చన్ అవర్' కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... అసెంబ్లీలో చర్చకు రమ్మంటే ఆయన పారిపోయారని ఎద్దేవా చేశారు కేసీఆర్ మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాము తెలంగాణలో జవాబుదారీతనం తెచ్చామని, ప్రజాపాలనలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

కేసీఆర్ మాటలకు విలువ లేదన్నారు. ఆయన పక్కా చవకబారు రాజకీయ నాయకుడని విమర్శించారు. ప్రతిపక్షనేతగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామని... అందుకే ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించానని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే దిగిపో అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భాష సరిగ్గా లేదన్నారు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదన్నారు. కరవు అనే పాపం కేసీఆర్ నుంచి వారసత్వంగా వచ్చిందన్నారు. కేసీఆర్ పాపాల వల్లే వర్షాలు కురవలేదన్నారు.

దుబారా తగ్గించుకుంటే మిగులు నిధులు ఉంటాయి

తాము ఈ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశామన్నారు. వంద రోజుల పాలన తర్వాత లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చిందని తెలిపారు. తాము 3 నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. కులగణనకు ఆదేశాలు ఇచ్చామని... డ్రగ్స్ మాఫియాను ఉక్కుపాదంతో అరికట్టామన్నారు. కేసీఆర్ వారసత్వంగా రూ.7 లక్షల కోట్ల అప్పులు మనపై పెట్టారని విమర్శించారు. మనం దుబారాను తగ్గించుకుంటే మిగులు నిధులు ఉంటాయన్నారు. ప్రాధాన్యతలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము అదే చేశామన్నారు. అవినీతికి పాల్పడమని హామీ ఇచ్చారు.

కేసీఆర్ ఉద్యోగులకు ఎప్పుడూ ఒకటో తారీఖున వేతనాలు ఇవ్వలేదని విమర్శించారు. తాము ఈ 100 రోజుల్లో చేసిన ఒక్క మంచి పని కూడా కేసీఆర్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్లలో విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. తాము పంద్రాగస్ట్ లోగా తప్పకుండా రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు.

కేసీఆర్ రుణమాఫీ హామీ ఇచ్చి అయిదేళ్ల వరకు చేయలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం మాత్రమే విపక్షాలు తమను బద్నాం చేయాలని చూస్తున్నాయన్నారు. తమ మొదటి ప్రాధాన్యత రుణమాఫీయే అన్నారు. 100 రోజుల పాలనను చూసి తాము తీర్పు కోరుతున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 39.5 శాతం ఓట్లు వచ్చాయని... లోక్ సభ ఎన్నికల్లో తమ ఓట్ల శాతం పెరిగితే తమపై ప్రజలకు విశ్వాసం పెరిగినట్లే అన్నారు. తమకు ప్రజలు 75 శాతానికి పైగా మార్కులు ఇచ్చే అవకాశం ఉందన్నారు.

ఆర్ ట్యాక్స్ అని కేటీఆర్ ప్రారంభిస్తే ఆ తర్వాత బీజేపీ ఎత్తుకుంది

ఆర్ ట్యాక్స్ అంటూ మొదట కేటీఆర్ ప్రారంభించారని... దీనిని బీజేపీ ఎత్తుకుందని మండిపడ్డారు. అసలు మేం ఇప్పటి వరకు టెండర్లు ఇచ్చింది లేదు, పిలిచింది లేదు... ఇక ఆర్ ట్యాక్స్ ఎక్కడిది? అని ప్రశ్నించారు. ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కంపెనీల యాజమాన్యాలను తాము బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నామన్న కిషన్ రెడ్డి ఆరోపణలను రేవంత్ రెడ్డి ఖండించారు. బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్నారు. గాడిద గుడ్డు పెట్టదు... బీజేపీ తెలంగాణకు ఏమీ ఇవ్వదు కాబట్టే ఆ మాట చెబుతున్నామన్నారు. కేంద్రం నిధులపై చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు. నిధుల కేటాయింపులో వివక్ష ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వంలో అన్ని పదవులూ ఉత్తరాదివారికే వస్తాయని ఆరోపించారు. పాలమూరు - రంగారెడ్డికి నిధులు తీసుకువస్తే కిషన్ రెడ్డిని అభినందిస్తామన్నారు.

ఇల్లు లేని వ్యక్తి రాహుల్ గాంధీ

ఈ దేశంలో ఇల్లులేని కుటుంబం ఉందంటే అది రాహుల్ గాంధీ కుటుంబం మాత్రమే అన్నారు. ప్రధాని మోదీ ఓ పక్క అంబానీ, మరో పక్కన అదానీని, ఇంకో పక్కన జిందాల్, హిమంత బిశ్వశర్మను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. తనపై అమిత్ షా చేసిన విమర్శలు సంక్రాంతి పండుగకు ముందు వచ్చే గంగిరెద్దుల వ్యవహారమని వ్యాఖ్యానించారు. అలాంటి వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

జాతీయ పార్టీల మధ్యనే పోటీ

ఈ లోక్ సభ ఎన్నికల్లో జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కుప్పకూలిందన్నారు. కేసీఆర్ పరోక్షంగా బీజేపీకి సహకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ కాంగ్రెస్ 14 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాము ఐదేళ్లు అధికారంలో ఉంటామన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు తీసేస్తామని బీజేపీ నేతలు అన్నారని తెలిపారు. కులగణనను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందో చెప్పాలన్నారు. ఇద్దరు దురాశపరులు కలిస్తే ప్రజలు మాత్రం తమను ఎన్నుకున్నారన్నారు.

  • Loading...

More Telugu News