Narendra Modi: వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి: ప్రధాని మోదీ

  • రాజమండ్రి సభలో ప్రధాని మోదీ ప్రసంగం
  • తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
  • మే 13 తర్వాత ఏపీ అభివృద్ధి యాత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని వెల్లడి
  • చంద్రబాబు హయాంలో అభివృద్ధి పరుగులు తీసిందన్న ప్రధాని
  • వైసీపీ హయాంలో అభివృద్ధిని పట్టాలు తప్పించారని విమర్శలు
PM Modi slams YCP govt

ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం రాజమండ్రి రూరల్ వేమగిరిలో కూటమి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. 

నా ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, రాజమండ్రి వాసులందరికీ నమస్కారాలు, గోదావరి నదీ తల్లికి ప్రణామం చేస్తున్నాను అని తెలిపారు. ఆదికవి నన్నయ నడయాడిన నేల ఇది... ఇక్కడే ఆయన తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ గడ్డ నుంచి కొత్త చరిత్ర ప్రారంభం కానుందని నాకు స్పష్టంగా తెలుస్తోందని మోదీ వివరించారు. 

"మే 13న మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం తథ్యం. దాంతోపాటే ఏపీ అసెంబ్లీలో రానున్న ఐదేళ్లు ఎన్డీయే ప్రభుత్వం ఉండబోతోంది. నేను ఇవాళ ఒడిశా నుంచి వచ్చాను... అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలో ఎక్కడెక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయో, ప్రతి చోటా ఎన్డీయే ప్రభుత్వమే రాబోతోంది. 

ఈ ఎన్నికల్లో రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, మరొకటి వైసీపీ. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ఫలితాలు రాకముందే ఓటమిని అంగీకరించారు. ఏపీలో ఉన్న ప్రజానీకం వైసీపీని పూర్తిగా తిరస్కరించింది. ఏపీలో వైసీపీకి ఐదేళ్లు అవకాశం లభించింది. కానీ ఈ ఐదేళ్లలో వారు పూర్తిగా వృథా చేశారు. ఏపీ అభివృద్థిని తిరోగమనంలో తీసుకెళ్లారు. 

గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లింది. అన్నింట్లోనూ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ అభివృద్ధి బండిని పట్టాలు తప్పించింది. ఈ ప్రభుత్వం ప్రజల మేలు కోసం పనిచేయడానికి బదులు, రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. అందుకే ఇవాళ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధిని సాధించడానికి ఉన్న ఏకైక గ్యారెంటీ ఎన్డీయే. 

ఏపీలో యువత ప్రతిభావంతమైనది. టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని యావత్ ప్రపంచం గుర్తించింది. ఈ దేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఏపీ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందడం ఎంతో అవసరం. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ఇలాంటి అభివృద్ధిని ఆశించడం పూర్తిగా వృథా. ఏపీలో అభివృద్ధి జీరో... అవినీతి మాత్రం 100 శాతం. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆలస్యం చేశారు. అందుకే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉండాలని చెబుతున్నాం. ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభం కావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండాలి. 

ప్రజలు కాంగ్రెస్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి. పదేళ్లకు ముందు కాంగ్రెస్ దేశాన్ని ఏ విధంగా అధోగతి పాల్జేసిందో అందరూ గమనించాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్కాముల గురించి తప్ప మరొక చర్చ ఉండేది కాదు. కాంగ్రెస్ నేతలు, ఈ ఇండియా కూటమి నేతలు ప్రతి రోజూ ఈడీపై గగ్గోలు పెడుతుంటారు. ఎందుకు వాళ్లు అంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారో అందరికీ తెలుసు. 

ఝార్ఖండ్ లో ఈడీ ఒక డబ్బు కట్టల కొండను వెలికితీసింది. మంత్రి కార్యదర్శి ఇంట్లో కట్టలుకట్టలుగా డబ్బు బయటపడింది. కాంగ్రెస్ నేతలు వారి ఇళ్లలో నల్ల డబ్బును దాచేందుకు గోడౌన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో దొరికిన డబ్బు కట్లను లెక్కబెట్టలేక మెషీన్లు కూడా అలసిపోతున్నాయి. ఇలా జరగడం మొదటిసారి కాదు. 

ఎందుకు కేవలం కాంగ్రెస్ నేతల ఇళ్లలోనే ఇలా డబ్బులు పట్టుబడుతున్నాయి? వీటిని దేనికి ఉపయోగించడానికి దాచిపెడుతున్నారో? మేం ఈ డబ్బును పట్టుకుంటే నాకు శాపనార్థాలు పెడుతుంటారు... మోదీ ఇలాంటి తిట్లకు భయపడే వ్యక్తి కాదు. ఇలాంటివాటిని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. 

ఏపీలో వైసీపీ ప్రతికూలతను దూరం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు ఇతర పార్టీలు బీజేపీ, ఎన్డీయే కూటమితో జతకట్టి రావాల్సిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలుచేస్తామని అధికారంలోకి వచ్చింది. కానీ ఇవాళ ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరుపుతోంది, అవినీతికి పాల్పడుతోంది. ఇక్కడ  మద్యానికి సంబంధించి ఒక పెద్ద సిండికేట్ నడుస్తోంది. ఏపీలో మద్యం మాఫియా, ఇసుక మాఫియాలు నడుస్తున్నాయి. 

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్ లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడింది. ప్రజలారా... మీకు గుర్తుండే ఉంటుంది... వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పింది. మరి ఇన్నేళ్లలో ఒక్క రాజధాని అయినా కట్టారా? మూడు రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేసే ప్రయత్నంలో ఉండగా, ఈ ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. 

వీళ్లు అవినీతిని మాత్రమే చేయగలరు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలియనే తెలియదు. ప్రజలకు సేవ చేయాలన్న కోరిక లేని ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి. 

పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ జీవనాడికి బ్రేక్ వేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదు. నేడు ఏపీ రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. రైతులకు మద్దతు ధర లభించడంలేదు. జూన్ 4 తర్వాత ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక, ఇటువంటి సమస్యలన్నీ దూరం చేస్తుంది. 

వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది వికసిత భారత్ అనే స్వప్నంలో భాగం. గత పదేళ్లలో ఏపీలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఎన్టీఆర్... రాముడు, తదితర అనేక పౌరాణిక పాత్రలతో ప్రజల హృదయాలను ఆకట్టుకున్నారు" అంటూ మోదీ వివరించారు.

  • Loading...

More Telugu News