Kangana Ranaut: తడబడిన కంగనా రనౌత్.. సొంత పార్టీ నేత తేజస్వీ సూర్యపై తీవ్ర విమర్శలు.. వీడియో ఇదిగో!

Kangana Ranaut Attacks Tejasvi Surya Mistaking Him For Tejashwi Yadav

  • ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ లక్ష్యంగా విమర్శలు
  • పేర్లలో సారూప్యత కారణంగా పొరపాటు
  • ‘ఈమె ఎవరు?’ అంటూ వీడియో షేర్ చేసిన తేజస్వీ యాదవ్

బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగన రనౌత్ పొరపాటు పడ్డారు. ఒకరిని మరొకరిగా భావించి సొంత పార్టీ నేతపైనే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను, బీజేపీ నాయకుడు తేజస్వీ సూర్యను ఒకరిగానే భావించి విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలని చూస్తే.. తేజస్వీ సూర్య గూండాయిజం చేసి చేపలు తినే రకమంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 

నిజానికి ఆమె విమర్శలు బీహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని చేసినవి అయినా, పేర్లలో సారూప్యత వల్ల ఆమె సొంత పార్టీ నేత, కర్ణాటకలోని బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తేజస్వీ సూర్యపై విమర్శలు గుప్పించారు. 

తేజస్వీ యాదవ్ ఇటీవల చేపలు తింటున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దానిని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కంగన వీడియోను షేర్ చేసిన తేజస్వీ యాదవ్..  ‘ఈమె ఎవరు?’ అని ప్రశ్నించారు. కంగనను బీజేపీ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బరిలోకి దింపినప్పటి నుంచీ ఆమె కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. అక్కడామె ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్ అయినప్పటికీ ఆమె అసలు లక్ష్యం మాత్రం రాహుల్ గాంధీయేనని తూర్పారబట్టారు.

More Telugu News