Supreme Court: రాహుల్ గాంధీ పేరుందని పోటీ చేయొద్దనలేం..: సుప్రీంకోర్టు

Supreme Court Rejected To Impose ban on namesake candidates in elections
  • ఒకే స్థానం నుంచి ఒకే పేరున్న వారి పోటీపై బ్యాన్ విధించాలని పిటిషన్
  • డూప్లికేట్ అభ్యర్థులతో సెలబ్రెటీ నేతలను దెబ్బ కొట్టే ప్రయత్నం
  • ప్రత్యర్థులు వారిని స్వతంత్రులుగా బరిలోకి దింపుతున్నారని ఆరోపణ
  • పేర్లు ఒకేలా ఉండడంతో ఓటర్లలో కన్ఫ్యూజన్ నెలకొంటోందన్న పిటిషన్ దారులు
ఒకే పేరున్న అభ్యర్థులు ఒకే నియోజకవర్గంలో పోటీపడడంపై నిషేధం విధించాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఒకే పేరున్నంత మాత్రాన పోటీ చేయొద్దనలేమని తేల్చిచెప్పింది. ఈ పిటిషన్ ను విచారించలేమని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు పెట్టిన పేర్లు వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా ఆపుతాయని పిటిషన్ దారులను ప్రశ్నించింది. ఒకవేళ ఎవరైనా రాహుల్‌గాంధీ, లాలూప్రసాద్‌ యాదవ్‌ వంటి పేర్లను పెట్టుకున్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయొద్దంటే వాళ్ల హక్కులను అడ్డుకున్నట్లే అవుతుందని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

ఎన్నికల్లో ప్రత్యర్థులను దెబ్బకొట్టి, తద్వారా తాము గెలిచేందుకు ఒకే పేరున్న అభ్యర్థులను రాజకీయ నేతలు వాడుకుంటున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలంటూ సాబు స్టీఫెన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనివల్ల ప్రముఖ నేతలకు ఇబ్బంది కలుగుతోందని ఆరోపించారు. ఒకే పేరుండడంతో ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురవుతున్నారని, తమ అభిమాన నేతకు ఓటేయడానికి బదులు డూప్లికేట్ వ్యక్తులకు ఓటేస్తున్నారని చెప్పారు. ప్రత్యర్థుల ఓట్లకు గండికొట్టడమే లక్ష్యంగా రాజకీయ నేతలు అనుసరిస్తున్న ఈ వ్యూహానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

అందుకే ఒకే పేరున్న అభ్యర్థులు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించేలా సమర్థమైన పరిశీలన, తగిన వ్యవస్థను తీసుకురావాలని అభ్యర్థించారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేయడానికి తల్లిదండ్రులు పెట్టిన పేరు అడ్డంకి కాబోదని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను విచారించలేమని స్పష్టం చేసింది.
Supreme Court
Namesake
Elections
Lok Sabha Polls
nomination

More Telugu News