Revanth Reddy: గుజరాత్ వాళ్లే మనుషులా... తెలంగాణ వాళ్లు కాదా?: ప్రధాని మోదీపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

CM Revanth Reddy fires at PM Modi
  • గుజరాత్‌కు లక్షల కోట్లు తరలిస్తున్నారని ఆరోపణ
  • బీఆర్ఎస్ చచ్చిన పాము... బీజేపీ అబద్ధాల పుట్ట అని విమర్శ
  • దేశ అభివృద్ధికి పీవీ ఆర్థిక సంస్కరణలే కారణమని వ్యాఖ్య
బీఆర్ఎస్ చచ్చిన పాము... బీజేపీ అబద్ధాల పుట్ట అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్‌కు ప్రధాని మోదీ లక్షల కోట్లు తరలిస్తున్నారని... అక్కడి వారే మనుషులా, తెలంగాణ వాళ్లు కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహించిన రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ వేశారని... ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా చేసిన ఆర్థిక సంస్కరణలే దేశ అభివృద్ధికి కారణమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్‌గా చెబుతున్న 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు పీవీ సంస్కరణలే పునాదులు అన్నారు.

బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్దాలు చెబుతున్నారని... తెలంగాణకు ఏం తెచ్చారో... ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. సింగరేణిలో 50వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని... ఇది నల్ల బొగ్గు కాదు... నల్ల బంగారమన్నారు. నేతకాని కార్పొరేషన్, సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాల కరకట్ట, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజురుకు కృషి చేస్తానన్నారు. పెద్దపల్లికి చాలా పెద్ద చరిత్ర ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లి అభివృద్ధి చెందలేదన్నారు.

వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా బీజేపీ అబద్దపు ప్రచారం చేస్తోందని విమర్శించారు. విభజన హామీలు ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు. సింగరేణి మూతబడే పరిస్థితి ఉంటే కేంద్రంతో మాట్లాడి రూ.1000 కోట్లు మంజూరు చేయించిన ఘనత కేకేది అన్నారు. పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి శ్రీపాదరావు అని కొనియాడారు. కాంగ్రెస్ రిజర్వేషన్లు పెంచాలని చూస్తే బీజేపీ రద్దు చేయాలని చూస్తోందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే రిజర్వేషన్లు ఎక్కడకూ పోవన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే మాత్రం రాజ్యాంగాన్ని మారుస్తుందని హెచ్చరించారు.
Revanth Reddy
Congress
BJP
Narendra Modi

More Telugu News