Telangana: వేముల రోహిత్ దళితుడు కాదు.. కేసు మూసేస్తున్నాం: హైకోర్టులో పోలీసుల పిటిషన్

  • అసలు కులం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడన్న తెలంగాణ పోలీసులు
  • రోహిత్ దళితుడని చెప్పడానికి ఆధారాలు లేవంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్
  • పలువురు బీజేపీ నాయకులకు దక్కనున్న విముక్తి
  • వాంగ్మూలాలను పట్టించుకోవడంలేదన్న రోహిత్ తమ్ముడు రాజా
  • శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని వెల్లడి
Telangana Police said that Vemula Rohit is not Dalit and are closing the case

యూనివర్సిటీల్లో దళితుల పట్ల వివక్ష చూపుతున్నారంటూ 2016 జనవరిలో దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసిన హెచ్‌సీయూ విద్యార్థి వేముల రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వేముల రోహిత్ దళితుడు కాదని, అతడి అసలు కులం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అందుకే ఈ కేసును మూసివేస్తున్నామంటూ తెలంగాణ హైకోర్టులో పోలీసులు కేసు మూసివేత పిటిషన్ దాఖలు చేశారు.

వేముల రోహిత్ కుటుంబానికి చెందిన కుల ధృవీకరణ పత్రాలను ఫోర్జరీ చేశారని, రోహిత్ దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ పోలీసుల పిటిషన్‌పై దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని వేముల రోహిత్ కుటుంబానికి హైకోర్టు సూచించింది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్‌. రాంచందర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు ఏబీవీపీ నేతలు సహా ఈ కేసులో నిందితులకు పోలీసులు ఉపశమనం కల్పించినట్టయ్యింది.

కాగా కులం స్టేటస్‌ని జిల్లా కలెక్టర్ మాత్రమే నిర్ణయించగలరని సీనియర్ అడ్వకేట్ ఏ.సత్య ప్రసాద్ చెప్పారు. కులం స్టేటస్‌ని పోలీసులు నిర్ణయించలేరని అన్నారు. పోలీసులు రోహిత్ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేయకుండా అతడి కులంపై దృష్టి సారించారని విమర్శించారు.

ఎలా వ్యక్తీకరించాలో అర్థం కావడం లేదు: వేముల రోహిత్ తమ్ముడు
ఈ కీలక పరిణామంపై వేముల రోహిత్ సోదరుడు రాజా స్పందిస్తూ.. పోలీసుల వాదన అసంబద్దమైనదని వ్యాఖ్యానించారు. తన భావాలను ఎలా వ్యక్తీకరించాలో అర్థం కావడంలేదని నైరాశ్యం వ్యక్తం చేశారు. మే 4న (శనివారం) సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని తమ కుటుంబం భావిస్తోందని రాజా తెలిపారు. కుల ధృవీకరణ అంశంపై 2017లో పోలీసులు విచారణను నిలిపివేశారని, 15 మంది సాక్షులు తమ వాంగ్మూలాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాగా వేముల రోహిత్ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసిన విషయం తెలిసిందే. దళితుల పట్ల యూనివర్సిటీల్లో వివక్ష కొనసాగుతోందంటూ విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News