mosquitoes: దోమల జాడను పసిగట్టేందుకు స్పై శాటిలైట్!

  • సిసిర్ రేడార్ అనే ఇండియన్ స్పేస్ స్టార్టప్ కంపెనీ వినూత్న ప్రయోగం
  • జలాశయాల్లో దోమల లార్వాను గుర్తించేలా డ్రోన్లకు హైపర్ స్పెక్ర్టల్ ఇమేజింగ్ కెమెరాల వాడకం
  • ప్రయోగం విజయవంతం.. ఐదు అంతస్తుల ఎత్తు నుంచే దోమల గుడ్ల జాడను పసిగట్టిన పరికరం
Indian Space StartUp Uses Spy Satellite Tech To Track Mosquitos

దేశంలో దోమల బెడద ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల వ్యాప్తి ఎన్నో రెట్లు అధికంగా ఉంటోంది. ఇళ్లలో ఎన్ని దోమల మందులు వాడినా, మున్సిపల్ సిబ్బంది ఎన్నిసార్లు దోమల మందు పిచికారీ చేసినా అవి దండయాత్ర చేస్తున్నాయి. మళ్లీమళ్లీ వచ్చి అందరినీ కుడుతున్నాయి. దోమకాట్ల వల్ల చాలా మంది డెంగ్యూ లాంటి ప్రమాదకర జ్వరాల బారిన కూడా పడుతున్నారు.

ఈ సమస్య పరిష్కారానికి కోల్ కతాకు చెందిన సిసిర్ రేడార్ అనే ఇండియన్ స్పేస్ స్టార్టప్ కంపెనీ వినూత్న ప్రయోగంతో ముందుకొచ్చింది. స్పై శాటిలైట్ టెక్నాలజీ వాడటం ద్వారా దోమల బెడదను దూరం చేయొచ్చని చెబుతోంది. చెప్పడమే కాదు.. ప్రయోగాత్మకంగా చేసి చూపించింది కూడా.. 

ఇందుకోసం అత్యాధునిక గూఢచర్య, నిఘా శాటిలైట్ టెక్నాలజీని దోమల జాడను పసిగట్టే సాంకేతికతగా మార్చింది. జలాశయాలు, నీటి  గుంటల్లో దోమల గుడ్లు ఉన్నాయో లేదో గుర్తించేందుకు హైపర్ స్పెక్ర్టల్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగించింది. ఈ టెక్నాలజీతో కూడిన కస్టమ్ మేడ్ కెమెరాలను డ్రోన్లకు బిగించింది. 

ఈ ప్రయోగంలో భాగంగా మట్టి గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులను తీసుకొని వాటిలో ఒకదాంట్లో స్వచ్ఛమైన నీటిని మరో దానిలో దోమల లార్వా ఉన్న నీటిని నింపి ఒక చోట దాచి ఉంచింది. అనంతరం డ్రోన్ ను ప్రయోగించగా అది 15 మీటర్ల ఎత్తు అంటే సుమారు ఐదు అంతస్తుల ఎత్తు నుంచే దోమల గుడ్లతో ఉన్న నీటి గ్లాసును గుర్తించింది.

దోమల వ్యాప్తిని ముందుగానే గుర్తించి అవి ఉన్న చోటే పురుగుమందులను పిచికారీ చేసేందుకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని సిసిర్ రేడార్ వ్యవస్థాపకుడు తపన్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం దోమల లార్వాను చంపేందుకు జలాశయాలపై పూర్తిగా పురుగుమందులు చల్లుతున్నారని చెప్పారు. దీనివల్ల నీరు విషతుల్యంగా మారి జలచరాలు మరణిస్తున్నాయన్నారు. తాము అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఈ సమస్యను అధిగమిస్తుందని ఆయన చెప్పారు.

తపన్ మిశ్రా ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ మాజీ డైరెక్టర్. ఫాదర్ ఆఫ్ ఇండియా స్పై శాటిలైట్స్ గా ఆయన పేరుగాంచారు. రేడార్ ఇమేజింగ్ పై ఆయనకు ఎంతో పట్టు ఉంది. పగలుతోపాటు రాత్రిపూట కూడా కనిపించే సామర్థ్యంతో స్పై శాటిలైట్లను అభివృద్ధి చేశారు. ఆయన కృషి వల్లే ఇస్రో రిశాట్–1, రిశాట్–2 స్పై శాటిలైట్లను అభివృద్ధి చేసింది.

More Telugu News