Bhopal: ఓటర్లకు బంపరాఫర్.. ఓటేస్తే లక్కీడ్రాలో వజ్రపుటుంగరం గెలుచుకునే అవకాశం!

  • పోలింగ్ శాతం పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ అధికారుల వినూత్న ప్రయోగం
  • మే 7న మూడో దశ పోలింగ్ సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్‌లో మూడుసార్లు లక్కీ డ్రా
  • విజేతకు అక్కడే బహుమతి ప్రదానం
  • రెండుమూడ్రోజుల తర్వాత మెగా డ్రా
  • ప్రకటించిన ఎన్నికల అధికారి
Diamond Ring For Vote Madhya Pradesh Election Commission Announced

దేశంలో విడతల వారీగా జరుగుతున్నసార్వత్రిక ఎన్నికలకు ఎండదెబ్బ బాగానే తగులుతోంది. నిప్పులు చెరుగుతున్న సూర్యుడి దెబ్బకు బయటకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు ఓటింగ్‌కు దూరంగానే ఉంటున్నారు. ఉదయం పది తర్వాతి నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ బూత్‌లు బోసిపోతున్నాయి. దీంతో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోతోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల పోలింగ్ శాతమే ఈ విషయం చెబుతోంది.

ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఈ నెల 7న మూడో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు లక్కీ డ్రాను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఓటింగ్‌లో పాల్గొన్న వారికి కూపన్ ఇస్తారు. ఆ తర్వాత లక్కీ డ్రా నిర్వహిస్తారు.

అందులో గెలుపొందిన వారికి డైమండ్ ఉంగరాలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఇతరవస్తువులు అందిస్తామని అధికారులు ప్రకటించారు. పోలింగ్ రోజు ఉదయం ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా నిర్వహిస్తారు. విజేతకు అక్కడే బహుమతిని అందిస్తారు. ఆ తర్వాత రెండుమూడు రోజులకు మెగా డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ తెలిపారు.

More Telugu News