Godrej: 127 ఏళ్ల చరిత్రకు ముగింపు.. రెండుగా విడిపోయిన గోద్రేజ్ కంపెనీ

  • కుటుంబ కంపెనీని పంచుకున్న అన్నదమ్ములు
  • ఆది గోద్రేజ్, నదిర్ ల వాటాకింద గోద్రేజ్ ఇండస్ట్రీస్
  • జంషెడ్ గోద్రేజ్, స్మితా గోద్రేజ్ లకు గోద్రేజ్ అండ్ బోయ్స్
Godrej Family Announces Split After 127 Years

దేశంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటిగా, 127 ఏళ్ల చరిత్ర కలిగిన గోద్రేజ్ కంపెనీ విడిపోయింది. గోద్రేజ్ కుటుంబ వారసులు గ్రూప్ ను రెండుగా విభజించారు. ఈమేరకు వారసుల మధ్య ఒప్పందం కుదిరిందని, వాటాల పంపకం కూడా పూర్తయిందని సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం.. ఆది గోద్రేజ్, నదిర్ ల వాటా కింద గోద్రేజ్ ఇండస్ట్రీస్ (5 లిస్టెడ్ కంపెనీలు) దక్కించుకోగా, జెంషెడ్ గోద్రేజ్, స్మితా గోద్రేజ్ కృష్ణలకు అన్ లిస్టెడ్ గ్రూప్ గోద్రేజ్ అండ్ బోయ్స్, దాని అనుబంధ సంస్థలు దక్కాయి. వీటితో పాటు వారికి ముంబైలోని 3,400 ఎకరాల భూమి (ల్యాండ్ బ్యాంక్) కూడా చెందనుంది. గోద్రెజ్ బ్రాండ్‌ను రెండు గ్రూపులు ఉపయోగించుకునేలా అంగీకారం కుదిరింది. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లో ఆది గోద్రేజ్ కుమార్తె పిరోజ్ షా గోద్రెజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు. 2026 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు. గోద్రెజ్ & బోయ్స్ గ్రూప్‌ కు సీఎండీగా జంషెడ్ గోద్రెజ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ న్యారికా హోల్కర్ నేతృత్వం వహిస్తారు.

తాళాలతో ప్రారంభించి గ్లోబల్ కంపెనీగా..
దేశానికి స్వాతంత్య్రం రాకముందే ప్రారంభమైన గోద్రేజ్ కంపెనీ తొలుత తాళాల అమ్మకం ద్వారా వ్యాపారం ప్రారంభించింది. 1897లో అర్దేశిర్ గోద్రేజ్ ఆయన సోదరుడు పిరోజ్ షా బుర్జోర్జీ గోద్రేజ్ లు కలిసి ప్రారంభించిన ఈ కంపెనీ ప్రస్తుతం భిన్న రంగాలకు విస్తరించి గ్లోబల్ కంపెనీగా మార్పు చెందింది. ఇంజనీరింగ్, పరికరాలు, భద్రతా పరిష్కారాలు, వ్యవసాయ ఉత్పత్తులు, రియల్ ఎస్టేట్ సహా గోద్రేజ్ గ్రూపు పలు రంగాలకు విస్తరించింది. ఇప్పటికీ చాలామందికి తాళం కొనాలంటే ముందు గుర్తొచ్చే పేరు గోద్రేజ్.. ఈ కంపెనీ బీరువాలకు ఆదరణ చాలా ఎక్కువ. కాగా, స్వతంత్ర భారతదేశం ఆర్థికంగా ఎదగడంలో గోద్రేజ్ పాత్ర కూడా ఉందని నాదిర్ గోద్రేజ్ చెప్పారు. విడిపోయినా కూడా గోద్రేజ్ వారసత్వం కొనసాగుతుందని, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సంస్థ తరఫున ఎల్లప్పుడూ కృషి చేస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News