Jagadguru: దేశంలోనే తొలిసారి.. 'జగద్గురు'గా దళితుడు!

  • మహామండలేశ్వర్ మహేంద్రానందగిరికి బిరుదు ప్రదానం
  • ఆయన ఇద్దరు శిష్యులకు మహామండలేశ్వర్, శ్రీమహంత్ బిరుదులు
  • జునా అఖాడాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రదానం
  • సింహాసనంపై కూర్చోబెట్టి వారి హోదాలు తెలిపే ఛత్రాలు అందజేత
Indias First Dalit Conferred Jagadguru Titile By Juna Akhara

దేశ చరిత్రలోనే తొలిసారి ఓ దళితుడికి జగద్గురు బిరుదు లభించింది. మహామండలేశ్వర్ మహేంద్రానందగిరి ఈ బిరుదు అందుకున్నారు. దేశంలోని 13 అఖాడాల్లో ఒకటైన జునా అఖాడా నిన్న ఆయనకీ బిరుదును అందించింది. మహేంద్రానందగిరి శిష్యులు కైలాశానాందగిరి, రాంగిరికి వరుసగా మహామండలేశ్వర్, శ్రీమహంత్ బిరుదులను ప్రదానం చేసింది. వీరందరూ షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ)కు చెందినవారే కావడం గమనార్హం. ప్రయాగ్‌రాజ్‌ జునా అఖాడాలోని సిద్దబాబా మౌజిగిరి ఆశ్రమంలో వేదమంత్రాల సాక్షిగా వీరు ఈ బిరుదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మహేంద్రానంద, కైలాశానందను సింహాసనంపై కూర్చోబెట్టి వారి హోదాలు తెలిపే ఛత్రాలు అందించారు.

ఈ సందర్భంగా కాశీ సుమేరు పీఠాధీశ్వర్ జగద్గురు స్వామి నరేంద్రానంద సరస్వతి మాట్లాడుతూ.. జునా అఖాడా నిర్ణయం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. శ్రీరాముడు చూపిన సామాజిక సామరస్యం బాటలో జునా అఖాడా నడుస్తోందని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన శ్రీమహంత్ ప్రేమ్‌గిరి మాట్లాడుతూ సన్యాసి సంప్రదాయంలో పాతుకుపోయిన కుల, వర్గ వివక్షను పారదోలేందుకు జునా అఖాడా పనిచేస్తున్నట్టు చెప్పారు. మహాకుంభ్-2025కు ముందు ఈ దిశగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ దళితులకు జగద్గురు, మహామండలేశ్వర్, శ్రీ మహంత్ వంటి బిరుదులను ప్రదానం చేస్తున్నట్టు వివరించారు.

More Telugu News